అనకాపల్లిలో ఆర్తనాదాలు..?
14కు చేరిన మృతులు..?
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్థానిక ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా…తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైన వారిలో చాలామంది కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 14కు చేరుకోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు రియాక్టర్ పేలుడుతో ఒక్కసారిగా భవనం పైకప్పు కుప్పకూలి మరికొందరు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. శిథిలాలకింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం మొత్తానికి ఈ ఘటనలో 22 మంది వరకు చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
చదవండి: ఆగని ‘అభయ’ ఘటనలు..?
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
తక్షణ చర్యలకు ఆదేశాలు
అచ్యుతాపురం ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కలెక్టర్‌ను అడిగి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిచేలా, తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ..ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియాలంటే సమయం పట్టేలా ఉందన్న ఆయన…రియాక్టర్ బ్లాస్ట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని ఓ అంచనాకు వచ్చామని, మొత్తం కార్మిక శాఖ యంత్రాంగం అక్కడే ఉందని తెలిపారు.