తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హను-మాన్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రతి టికెట్ పై 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని సినిమా ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్స్ అనౌన్స్ చేసింది. ప్రకటించినట్లుగానే ఇప్పుడు ప్రీమియర్ షోస్ నుంచి అమ్మిన 2 లక్షల 97 వేల టికెట్స్ నుంచి ఒక్కో టికెట్ మీద 5 రూపాయల చొప్పున 14 లక్షల 85 వేల రూపాయల చెక్ ను ఇప్పటికే అందించారు.
ఇక ‘హను-మాన్’ సినిమాకు కొనుగోలు జరిగిన మొత్తం టికెట్స్ 53 లక్షల 28 వేల టికెట్స్ నుంచి 2 కోట్ల 66 లక్షల రూపాయల చెక్ ను త్వరలో రామమందిర ట్రస్టుకు అందిస్తున్నట్లు సినిమా టీమ్ తెలిపింది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న రిలీజైన ‘హను-మాన్’ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా రెండో వారంలోనూ స్ట్రాంగ్ వసూళ్లతో థియేటర్స్ లో రన్ అవుతోంది.