ఒక్క డైలాగ్ తో పాపులర్ అయిన నటులు చాలామందే ఉన్నారు. వారిలో అభినవ్ గోమఠం ఒకరు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా నీలో…కమల్ హాసన్ అంటూ ఓ డైలాగ్ చెబుతారు. ఈ డైలాగ్ అభినవ్ కు బాగా పేరు తీసుకొచ్చింది. సోషల్ మీడియా ట్రోల్స్, మీమ్స్ లో ఈ డైలాగ్ తప్పకుండా ఉంటుంది. అంత పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఇదే పేరుతో అభినవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.
మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాలో వైశాలి రాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకంపై భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా సినిమా లోగోను దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అభినవ్ గోమఠం లోని నటుడిని కొత్తగా చూపిస్తుందని ఆయన అన్నారు. నెక్ట్ మంత్ సెకండ్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.