కబీ అల్విదా నా కెహనా, హ్యాపీ న్యూ ఇయర్ వంటి చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించిన షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్. ఇప్పుడు ఒకర్నినొకరు ఢీకొనబోతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై హీరో విలన్ గా కనిపించబోతున్నారు. అభిషేక్ బచ్చన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించారు. ఆయనకు గత కొంతకాలంగా హిట్స్ లేవు. సినిమాలు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో విలన్ గా నటించాలనే నిర్ణయం తీసుకున్నారు అభిషేక్. షారుఖ్ ఖాన్ హీరోగా నటించనున్న కింగ్ సినిమాలో విలన్ గా అభిషేక్ ను కన్ఫర్మ్ చేశారు.
ఈ వార్తలు గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్నా…తాజాగా అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా రిప్లై ద్వారా ధృవీకరించారు. పీపింగ్ మూన్ ఈ వార్తను ట్వీట్ చేయగా..అమితాబ్ రిప్లై ఇస్తూ అభిషేక్ కు ఇది రైట్ టైమ్ అంటూ స్పందించారు. దీంతో ఇది నిజమేనని తెలుస్తోంది. కింగ్ సినిమాలో షారుఖ్ తనయ సుహానా కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో కింగ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.