తెలుగుజాతిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తెలుగు ప్రజలపై తమిళ నటి, బీజేపీ నేత కస్తూరి నోరు జారారు. స్వరాష్ట్రంలోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ తెలుగు ప్రజలను ఛీత్కరించేలా తన నాలుకకు పనిచెప్పారు. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారే తెలుగువారని, అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళజాతి అని పెద్దమాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
300ఏళ్ల క్రితం ఒకరాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవచేసేందుకు వచ్చిన తెలుగువారు ఇప్పుడు వారిది తమిళ జాతి అంటుంటే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ద్రవిడ సిద్ధాంత వాదులను పరోక్షంగా ప్రశ్నించడం గొడవకు దారితీసింది. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దని, పరస్త్రీలపై మోజు పడొద్దని, ఎక్కువమందిని భార్యలుగా చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని కస్తూరి ఆరోపించారు.
ఇదంతా డీఎంకే పనే, తన తప్పేంలేదన్న కస్తూరి..!
అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ నటి కస్తూరి యూటర్న్ తీసుకున్నారు. తెలుగు నా మెట్టినిల్లు, తెలుగువారంతా నా కుటుంబం. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు, తెలుగువారు ఎంతోమంది నాపై అభిమానం చూపిస్తున్నారు, నా వాఖ్యలను వక్రీకరిస్తూ తమిళ మీడియాలో వస్తున్న వార్తలను తెలుగువారు నమ్మొద్దని కోరుతున్నా. దీనికంతటికీ కారణం అధికార డీఎంకేనే. నాపై నెగిటివిటీ తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తోందని నటి కస్తూరి ఆరోపించారు.