టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే… తనకు అభిమానులు కాదు… ఆర్మీ ఉందంటూ ప్రతి ఈవెంట్ లో అల్లు అర్జున్ చెపుతుండటం అందరికీ తెలిసిందే. ‘పుష్ప 2’ ఈవెంట్లలో కూడా ఇదే విషయాన్ని చెపుతూ వస్తున్నారు. దీనిపై శ్రీనివాస్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన అభిమాన సంఘానికి ‘అర్జున్ ఆర్మీ’ అని బన్నీ పేరు పెట్టుకున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆర్మీ అనేది దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరు అని… ఈ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం సరికాదని అన్నారు. ఇదేదీ పట్టించుకోకుండా అల్లు అర్జున్ తనకు ఆర్మీ ఉందని చెపుతున్నారని… వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
మరోవైపు, ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. చిత్ర యూనిట్ దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.