నిన్నమొన్నటిదాకా మన టాలీవుడ్ అంటే బాలీవుడ్ వాళ్లు లైట్ తీసుకునేవాళ్లు. చిన్న చిత్రాలుగా పరిగణించి చిన్నచూపు చూసేవాళ్లు. అయితే ఈ జాడ్యం ఇప్పటినుంచి వచ్చింది కాదు, స్వాతంత్ర్యం సిద్ధించింది మొదలు దక్షిణాధి అంటే అన్ని రంగాల్లో ఉత్తర భారతీయులకి చిన్నచూపనే చెప్పాలి. అలా క్రమక్రమంగా మన సినిమా ఇండస్ట్రీపైనా ఆ మరక పడిపోయింది. అయితే అన్ని రోజులు ఒక్కరివే కాదుగా…రోజులు మారాయి…క్రియేటివిటి ఎవడబ్బ సొత్తూ కాదని దక్షిణాధి ఫిల్మ్ ఇండస్ట్రీ, మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ ప్రూవ్ చేసి వాళ్ల నోళ్లు మూయించేలా చేసింది.
అయితే నేటి తరం దర్శకధీరులతో…కథను నమ్మి ఎంతైనా డబ్బు పెట్టే సత్తా ఉన్న నిర్మాతలతో తెలుగువాళ్ల సత్తా ఏంటో గత దశాబ్దకాలంగా వస్తున్న సినిమాలను చూస్తే అవగతమవుతుంది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్తే మన సీనియర్ నటుల పోస్టర్స్ లేకపోవడం బాధకలిగించిందన్న మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలను ఈ సమయాన గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతీయ అవార్డులు కేవలం నార్త్ ఇండియా నటులకే పరిమితమన్న ఉద్దేశాలను చెరిపిపడేశారు ఇప్పడువస్తున్న తెలుగుదర్శకులు. ఉదాహరణకే చూసుకుంటే RRR మూవీకి ఆరు జాతీయ అవార్డులతో తెలుగు సినీ కళామ్మతల్లికి జాతర జరిగితే…అదే మూవీతో అంతర్జాతీయ వేదికగా ఆస్కార్ అవార్డు పొంది దేశం మొత్తం మన తెలుగోడి వైపు చూసేలా చేసింది.
చదవండి: ఇకపై శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు
ఇదీ మన తెలుగోడి సత్తా…
ఒకప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేసిన అమితాబ్, సల్మాన్‌ఖాన్, జాకీష్రాఫ్, వివేక్ ఒబెరాయ్, సునీల్‌శెట్టిలు ఇప్పుడు తెలుగు సినిమాల్లో, అందులోనూ సత్తా చాటుతున్న డైరెక్టర్స్‌కు అందుబాటులో ఉంటున్నారట. ఎందుకంటే తెలుగుసినిమాను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లే సత్తాను మన డైరెక్టర్లలో గమనించిన బాలీవుడ్ బడా యాక్టర్స్…క్యారెక్టర్ ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి కారణమూ లేకపోలేదు…వాళ్లు బాలీవుడ్‌లో ఫేడ్ అవుట్ అవ్వకుండా చూసుకోవడం ఒక ఎత్తయితే…భాషాభేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల అభిమానులకు దగ్గరవడం, పరోక్షంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఇదివాళ్లకి కలిసొచ్చే అంశం.
చిరు పక్కన సైరాలో అమితాబ్…గాడ్ ఫాదర్‌లో సల్మాన్ గెస్ట్ రోల్…ఈ మధ్యనే విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్‌రెడ్డి వంగా యానిమల్ మూవీలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, సన్నీ డియోల్ యాక్ట్ చేయగా…పూరి డబుల్ ఇస్మార్ట్‌లో డైరెక్ట్ తెలుగులో ఫస్ట్ టైమ్ సంజయ్ దత్ యాక్ట్ చేయడం మరో విశేషం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే…బాలీవుడ్ నటీమణులు ఎప్పటినుంచో మన తెలుగుహీరోలు పక్కన యాక్ట్ చేస్తున్నా…ప్రస్తుత బాలీవుడ్ హీరోలు, ఇతరత్రా పెద్దతరహా నటులు మన దక్షిణాది డైరెక్టర్ల పిలుపు ఎప్పుడొస్తుందా అని వేచిచూడటమనేది నిజంగా మన నేటితరం దర్శక, నిర్మాతల సత్తాకు సలాం చేయాల్సిందే.
(సమీక్ష – అడ్డగళ్ల రాధాకృష్ణ)