అల్లు వారి యంగ్ హీరో కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా బడ్డీ. ట్రైలర్, టీజర్‌లతో మంచి ఆసక్తి రేపిన ఈ ఇంట్రస్టింగ్ థ్రిల్లర్ థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను పలకరించింది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాత కే.ఈ.జ్ఞానవేల్ రాజా కాగా, దర్శకుడిగా సామ్ ఆంటోన్ మెగా ఫోన్ పట్టారు. వాస్తవానికి ఈ చిత్రకథ మాతృక తమిళంలో టెడ్డీ పేరుతో రిలీజ్ కాగా, తెలుగులో బడ్డీగా రీమేక్ చేశారు. ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచరస్, థ్రిల్లర్‌గా బడ్డీ మూవీ ఉంటుంది.
కథ విషయానికి వస్తే వైజాగ్‌లో పైలట్‌గా ఆదిత్య రామ్ (అల్లు శిరీష్) పనిచేస్తుంటాడు. అలాగే తనతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్) ఆదిత్య ప్రేమలో పడుతుంది. టేకాఫ్, ల్యాండింగ్ టైమ్‌లో మాట్లాడుకునే వారిద్దరూ ఎప్పుడూ కూడా ఒకరునొకరు చూసుకోరు. సమయం వచ్చినప్పుడు తానే పరిచయం చేసుకుని మనసులోని మాట చెప్పాలనుకుంటుంది పల్లవి. తీరా కలుద్దాం అనుకునే లోపు హీరోయిన్ కిడ్నాప్‌కు గురవడం ఒక ట్విస్ట్ అయితే…ఏటీసీగా పల్లవి విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో ఆదిత్య ఉద్యోగం పోతుంది. దీంతో ఆ డిప్రెషన్‌లో ఇంట్లోనే ఉంటాడు మన హీరో.
చదవండి: రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి థర్డ్ సింగిల్ జిక్కీ రిలీజ్
ఇంతకీ ఎందుకు పల్లవి కిడ్నాప్ అయింది? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు కిడ్నాప్ చేశారు? అనే కోణంలో ప్రేక్షకులకు డౌట్స్ రాగానే విషయాన్ని రివీల్ చేస్తాడు డైరక్టర్. హాంకాంగ్‌లో ఓ బిగ్‌షాట్ తనయుడికి హార్ట్ ప్రాబ్లం వస్తే… అతనికి సరిపోయే హ్యూమన్ హార్ట్‌ను తీసుకొచ్చి సర్జరీ చేస్తే బతుకుతాడని వైద్యులు చెబుతారు. దీంతో కొడుకుపై ఉన్న ప్రేమతో సదరు తండ్రి అవయవాల ముఠా లీడర్ డాక్టర్ అర్జున్ (అజ్మల్ అమీర్)తో డీల్ కుదుర్చుకుంటాడు. సరిగ్గా వైజాగ్ ఏటీసీలో పనిచేసే పల్లవి హార్ట్ అయితేనే సరిపోతుందని తెలుసుకున్న అతడు.. ఆమెను కిడ్నాప్ చేయిస్తాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఆమెకు ఇచ్చిన ఇంజక్షన్ వల్ల కోమాలోకి వెళ్లిపోవడం…వెనువెంటనే ఆత్మ ఓ టెడ్డీ బేర్‌లోకి చేరిపోవడం జరుగుతుంది. అయితే టెడ్డీ బేర్‌లోకి వెళ్లిన పల్లవి ఆత్మ…తన శరీరం ఎక్కడుందో తెలుసుకుని అందులోకి ప్రవేశించాలని తపన పడుతుంటుంది. దీనికి ఆదిత్య (అల్లు శిరిష్) అయితేనే తనను కష్టాల్లోంచి గట్టెక్కిస్తాడని అతని వద్దకు చేరి జరిగిందంతా చెప్పగా… తనకు సహాయం చేయడానికి ముందుకొచ్చి తనదైన శైలిలో అన్వేషణ ప్రారంభిస్తాడు.
ఈ క్రమంలో పల్లవి మాదిరిగా ఓ బాబు కూడా సదరు ముఠా కిడ్నాప్ చేయడం, షిప్ ద్వారా హాంకాంగ్‌కి తీసుకెళ్తున్నారని తెలుసుకున్న హీరో ఆదిత్య… పిల్లాడిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అయితే అనూహ్యంగా అదే కంటైనర్‌లో టెడ్డీ బేర్ చిక్కుకుపోవడం, సరాసరి హాంకాంగ్ చేరిపోవడం జరిగిపోతుంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం టెడ్డీ బేర్‌కు సహాయం చేసేలా హీరో ఆదిత్య వేసిన అడుగులు చివరికి హాంకాంగ్ వైపు పడతాయి. అయితే సెకండాఫ్ మొత్తం హాంకాంగ్‌లోనే ఉండటంతో హీరోకి సహాయకులుగా అలీ, ప్రిషా రాజేశ్ సింగ్ ఉంటారు. అదే సమయంలో ఆదిత్య రూమ్‌మేట్‌గా, బాబయ్‌గా పిలిచే ముఖేశ్ రిషి వైజాగ్‌లో విలన్ గ్యాంగ్ పని పడతాడు.
అయితే అర్జున్ డెన్ తెలుసుకున్న హీరో ఆదిత్య షార్ప్‌గా ఆలోచించి విలన్‌కే కాదు ప్రేక్షకులకూ షాక్ ఇస్తాడు. పల్లవిని రక్షించి ఇండియా తీసుకెళ్లిపోతాడని అందరూ అనుకున్న సమయంలో… ఎవరికైతే పల్లవి గుండె అమర్చి విలన్ కాపాడాలనుకుంటాడో అతన్నే మన హీరో కిడ్నాప్ చేయడం ఇక్కడ ట్విస్ట్. ఆ తరువాత ఏమి జరిగింది…చివరకు ఆదిత్య, పల్లవిని కాపాడటాడా? డాక్టరు అర్జున్ పల్లవి గుండె గ్యాంగ్ స్టార్ కొడుకు కు పెడతాడా లేదా? అసలు బడ్డి లో ఉన్న పల్లవి ఆత్మ ఎలా పల్లవిలోకి ప్రవేశిస్తుంది..ఇవి అన్నీ తెలియాలి అంటే బడ్డి చూడాలి..
చిత్ర బలాబలాలు –
పైలట్‌గా అల్లు శిరీష్ స్టైలిష్ లుక్స్, డాన్స్, ఫైట్స్‌తో అదరగొట్టి మంచి మార్కులే వేసుకున్నాడు. ఎప్పుడూ విలన్ పాత్రలో చూసిన ముఖేష్ రిషి ఇందులో హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. డీవోపీ చాలా బాగుంది. మెయిన్‌గా థ్రిల్లర్‌లా సాగిన ఈ కథనానికి ఆర్ ఆర్ మంచిగా ఇవ్వడంతో ఇదొక బిగ్ అస్సెట్‌గా చెప్పొచ్చు. విలన్‌గా అజ్మల్ అమీర్ అదరగొట్టాడు. హీరో పాత్రను ఎలివేట్ చేయడంలో విలన్‌గా క్రూయల్ యాక్టింగ్‌తో ఇరగదీశాడు.
చిత్ర బలహీనతలు –
హీరోయిన్ కోమాలోకి వెళ్లినప్పటినుంచి టెడ్డీ బేర్‌నే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకోవడం ఒకింత పిల్లల సినిమా అనిపిస్తుంది. టెడ్డీ బేర్‌లో ఉన్న పల్లవి ఆత్మ
కనబడిన వారందరితో ఈజీగా మాట్లాడేయటం, వారుకూడా లైట్ తీసుకుని టెడ్డీకి రిప్లై ఇవ్వడం డైజెస్ట్ చేసుకోలేని విధంగా ఉంటుంది. ముఖేశ్ రిషి, సెకండాఫ్‌లో వచ్చిన అలీ, ప్రిషా రాజేశ్ సింగ్ పాత్రలు తమ పరిధిలో మాత్రమే ఉండి అప్పుడప్పుడు వచ్చి పోతుంటాయి.
మొత్తంగా బడ్డీ పేరుతో వచ్చిన ఈ మూవీ పెద్దవాళ్లకన్నా చిన్నపిల్లలు చాలా ఇంట్రస్ట్‌గా చూస్తారనేది తెలుస్తోంది.
అంతేకాదండోయ్ పిల్లలు సినిమా చూస్తాం అని మారాం చేస్తే ఇటు పెద్దోల టికెట్లు కూడా తెగుతాయికదా …సో, ఈ విధంగా పైసా వసూల్ సినిమాగా ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ ఇచ్చేయొచ్చు.
(గమనిక – ఈ మూవీ రివ్యూ ఆసాంతం ప్రేక్షకుల అభిప్రాయాలనుంచి తీసుకున్నది మాత్రమే)
రేటింగ్ 3/5