చిరంజీవికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు రైటర్ చిన్ని కృష్ణ. గతంలో చిన్ని కృష్ణ చిరంజీవిని విమర్శిస్తూ మాట్లాడారు. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో ఇవాళ చిన్ని కృష్ణ చిరంజీవిని కలిశారు. చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాకు కథను అందించారు చిన్నికృష్ణ. అప్పటి నుంచి వారి మధ్య మంచి రిలేషన్ ఉండేది. ఆ తర్వాత చిన్ని కృష్ణ చిరంజీవికి దూరమవుతూ వచ్చారు. తాజాగా చిరంజీవిని కలిసిన సందర్భంగా చిన్ని కృష్ణ సారీ చెప్పారు. చిరంజీవికి ఒక గొప్ప కథను సిద్ధం చేస్తానని అన్నారు.
చిన్ని కృష్ణ మాట్లాడుతూ – చిరంజీవి అన్నయ్యను ఈ రోజు ఆయన నివాసంలో కలిశాను. గతంలో కొంతమంది ప్రోద్భలంతో నా జీవితంలోనే అత్యంత దారుణమైన బ్యాడ్‌టైమ్‌లో అన్నయ్యను నా నోటితో అనరాని మాటలన్నాను. జీవితంలో ఏ మనిషైనా టైమ్ బాగాలేనప్పుడు తెలియకుండానే తప్పులు చేస్తారు. నేను ఆ తప్పు చేశానని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నా. ఏం కథలు రాస్తున్నావు చిన్ని అని ఆప్యాయంగా మాట్లాడారు. ఇంతకంటే ఏం కావాలి ఈ లైఫ్‌కి. మళ్లీ నాకు ఆయనకు ‘‘ఇంద్ర–2’’లాంటి ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని అవుతుందని త్వరలోనే అలాంటి మంచి వార్త అందరు వింటారని అనుకుంటున్నా. అని చెప్పారు.