తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన హనుమాన్ ఈ నెల 12న రిలీజ్ కాబోతోంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. హనుమాన్ భక్తుడిగా తాను ఎలా మారింది తెలిపాడు.
చిరంజీవి మాట్లాడుతూ – మొదట్లో మా ఇంట్లో ఎవరికీ దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు. అమ్మ ఒక్కరే పూజలు చేసేవారు. నాన్న కమ్యూనిస్ట్. ఆయనకు దేవుడంటే నమ్మకం లేదు. అమ్మ చెప్పిన తర్వాత నేను ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మొక్కేవాడిని. కోరుకున్న చోటుకి ట్రాన్స్ ఫర్ అయ్యాక నాన్న కూడా హనుమాన్ ను నమ్మడం మొదలుపెట్టారు. నాకు లాటరీలో ఒక ఆంజనేయస్వామి ఫొటో వచ్చింది. ఇప్పటికీ ఆ ఫొటోకు పూజలు చేస్తున్నా. హనుమాన్ ఒక్కసారి మనల్ని ఆశీర్వదించడం మొదలుపెడితే జీవితాంతం తోడుంటాడు. హనుమాన్ సినిమా ప్రతి టికెట్ పై ఐదు రూపాయలు అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉంది. చిన్న సినిమా అయినా బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు చూస్తారు. అని చెప్పారు.