పద్మవిభూషణ్ అవార్డ్ పొందిన మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ మెగాస్టార్ గా మారి…ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పురస్కారం పొందడం ఎందరికో స్ఫూర్తి అంటూ చిరంజీవికి ప్రశంసలు అందుతున్నాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్మాత దిల్ రాజుతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను అభినందించారు. శాలువాతో సత్కరించారు.
సోషల్ మీడియా ద్వారా మోహన్ బాబు, రాజమౌళి, రాఘవేంద్రరావు, మమ్ముట్టి, నాని, రవితేజ ..తదితర ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అంతా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాలో చిరు సినిమా క్లిప్పింగ్స్, ఆయన సినిమాల సీన్స్ షేర్ చేస్తున్నారు. పునాది రాళ్లు సినిమాలో తొలి పరిచయం అంటూ చిరంజీవికి వేసిన టైటిల్ కార్డ్ వీడియోలు కూడా సందడి చేస్తున్నాయి.