మహేశ్ బాబుతో రూపొందించిన శ్రీమంతుడు సినిమా కాపీ రైట్స్ వివాదం దర్శకుడు కొరటాల శివను వీడటం లేదు. ఈ సినిమా కథ తనదే అంటూ శరత్ చంద్ర అనే రచయిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇక్కడి నాంపల్లి కోర్టుతో పాటు, హైకోర్టు కూడా శరత్ చంద్రకు శ్రీమంతుడు సినిమా కథ మీద రైట్స్ ఉన్నాయంటూ చెప్పింది. దీంతో సుప్రీం కోర్టుకు కొరటాల శివ వెళ్లగా..అక్కడ కూడా శరత్ చంద్రకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. కొరటాల శివ క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సిందే అని తేల్చిచెప్పింది కోర్టు.
కోర్టు తాజా ఆదేశాలతో సందిగ్ధంలో పడ్డారు కొరటాల శివ. ఈ కోర్టు తీర్పు ఆయన ఎన్టీఆర్ తో రూపొందిస్తున్న దేవర మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు మేరకు కొరటాల శివ క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటే అది జైలు శిక్ష దాకా వెళ్తుందా లేక జరిమానాతోనే ఆగిపోతుందా అనేది చూడాలి. కోర్టు బయటే శరత్ చంద్రతో కొరటాల శివ రాజీ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా ఆయన క్రియేటివ్ మైండ్ తో దేవర రూపొందించే క్రమంలో ఈ కోర్టు తీర్పులు ఇబ్బందులు కలిగించేలా ఉన్నాయి.