లైగర్ మూవీ తర్వాత పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై వచ్చిన తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీని పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించగా…హీరోగా రామ్ పోతినేని, హీరోయిన్‌గా కావ్య థాపర్ నటించారు. తన చిత్రాలకు ఎప్పుడూ బాలీవుడ్ టచ్ ఇచ్చేలా చూసుకునే పూరి…ఈ సినిమాలో కూడా క్యాస్టింగ్ విషయంలో తగ్గలేదు. విలన్‌గా సంజయ్ దత్‌ను పెట్టి చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశారు. అలాగే మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్‌లో ఎక్కడా జోష్ తగ్గలేదు.
కథ విషయానికి వస్తే…
ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పేరుతో గతంలో వచ్చిన మూవీకి సీక్వెల్‌గా తీసిన చిత్రమే డబుల్ ఇస్మార్ట్. ఇంటర్నేషనల్ మాఫియా డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్) బ్రెయిన్ ట్యూమర్ అనే వ్యాధితో మూడు నెలల్లో చనిపోతాడన్న ఓపెనింగ్ సీన్‌తో కథ మొదలవుతుంది. అయితే భారతదేశంలో నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ మధ్య చిచ్చుపెట్టి ఇండియాను రెండుముక్కలుగా చేసి.. ఆ గొడవల్లో తాను అమ్మే వెపన్స్ ద్వారా ప్రపంచాన్ని శాసించేస్థాయికి తాను ఎదగాలని కలలు గంటాడు… అయితే అది తన చావుతో నెరవేరలేకపోతుందన్న బాధ బిగ్‌బుల్‌ను వెంటాడుతుంది. తాను శారీరకంగా లేకున్నా తన ఆలోచనలు బతికితే చాలనే స్థితికి వచ్చేస్తాడు. ఈ క్రమంలో ఓ సైంటిస్ట్ (మకరంద్)ను సలహాకోరగా…కచ్చితంగా అది సాధ్యపడుతుందని చెబుతాడు. వేరేవాళ్ల మెదడులో బిగ్‌బుల్ మెమరీని ట్రాన్స్‌ఫర్ చేసి ఆ ఆలోచనలను తరతరాలుగా బతికించొచ్చని చెబితే సంతోషంతో ఉప్పొంగిపోతాడు బిగ్‌బుల్. అయితే పరిశోధనల పేరుతో సదరు సైంటిస్ట్ చేసే ప్రయోగాలలో అనేకమంది యువకులు చనిపోతుంటారు. ఈ క్రమంలో ఇండియాలో ఉండే శంకర్ మెదడు అయితేనే ప్రయోగం సక్సెస్ అవుతుందని సైంటిస్ట్ చెప్పగా సదరు బిగ్ బుల్ టీమ్ ఇండియాకు వచ్చేయడం…శంకర్‌కు ఓదశలో తారాసపడటం..చివరికి ఫైటింగ్‌లు, ఛేజింగులు వరకు వెళ్లడం జరిగిపోతాయి. అయితే స్వతహాగా మొండివాడు, పట్టుదలలో ముందువరుసలో ఉండే శంకర్ చిక్కడు దొరకుడులా బిగ్‌బుల్ టీమ్‌కు ముచ్చెమటలు పట్టిస్తాడు. ఇక ఇలా అయితే లాభం లేదనుకుని నేరుగా బిగ్‌బుల్ (సంజయ్‌దత్)నే ఇండియా వచ్చి శంకర్‌ను బంధించి సైంటిస్ట్ ద్వారా చిప్ అమర్చుతాడు…అయితే బిగ్‌బుల్‌ని ఎప్పుడు పట్టుకుందామా అని పూర్తి ఫోకస్‌లో ఉన్న సీబీఐ అధికారి (షయాజీ షిండే) శంకర్‌ను బంధించిన స్థావరానికి చేరుకుని ఫైరింగ్ చేపడతాడు. ఈ క్రమంలో బిగ్‌బుల్ తప్పించుకోగా… అతడి మెమరీ అప్పటికే ట్రాన్స్‌ఫామ్ అయిన శంకర్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంటారు సదరు సీబీఐ బృందం…ఇక్కడి వరకు ఫస్టాఫ్‌ను డైరెక్టర్ చెప్పాలనుకుంది చెప్పి ప్రేక్షకుడికి టీ తాగేందుకు ఒక బ్రేక్ ఇస్తాడు.
చదవండి: మెగా ఫ్యామిలీ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా నిహారిక
కథనంలో భాగమిది
చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన పోచమ్మ (ఝాన్సీ) తన కొడుకు (శంకర్)తో కలిసి ఓ ఇంట్లో పనిచేస్తూ కాలం వెళ్లదీస్తుంది. అయితే అనూహ్యంగా ఆ ఇంట్లో పెద్దమనిషి చంపబడటం..అది చూసిన పోచమ్మ కూడా హత్యకు గురవడం…తల్లిని చంపినవాడిని కళ్లారా చూసిన హీరో…సదరు విలన్ బిగ్‌బుల్ స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడిచేసి సరకును దొంగతనం చేయడం..
అదే సమయంలో బిగ్‌బుల్ మాఫియాపై కన్నేసిన హీరోయిన్ జన్నత్ (కావ్య థాపర్) అతని చీకటి సామ్రాజ్యాన్ని క్లోజ్ చేయాలని స్పెషల్ ఆపరేషన్ పేరుతో ఢిల్లీ నుంచి రావడం…విచిత్రంగా వారిద్దరూ ఒకరునొకరు ప్రేమలో పడటం జరిగిపోతాయి. అయితే ఇంతకీ తన తల్లి పోచమ్మను చంపిందెవరు?…బిగ్‌బుల్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఎలా అయ్యాడు?…హీరో మెదడులో విలన్ మెమరీ చిప్ అమర్చాక ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయి..? శంకర్ స్ల్పిట్ పర్సనాలిటీతో తలెత్తిన ఇబ్బందులు ఏంటి..? నిజంగా బిగ్‌బుల్‌కు బ్రెయిన్ ట్యూమర్ ఉందా…లేక అతన్ని ఎవరైనా మిస్‌గైడ్ చేశారా?…చివరికి విలన్ ఎలా హతమవుతాడు ? అనేది చిత్ర కథాంశం.
చిత్ర బలాబలాలు
హీరోగా శంకర్ పాత్రలో రామ్ పోతినేని ఎనర్జటిక్ యాక్టింగ్, స్టంట్స్, డ్యాన్స్
తన సినిమాల్లో హీరోయిన్‌ని స్పెషల్‌గా చూపించడంలో దిట్ట అయిన పూరి ఇందులోనూ కావ్యథాపర్‌ను స్క్రీన్‌పై మెరిపించాడు…
మణిశర్మ బాణీలు అదుర్స్, అంతే విధంగా నేపథ్య సంగీతమూ సెహభాష్…
టాలీవుడ్‌లో ఫస్ట్‌టైమ్ నటించిన సంజయ్ దత్ బిగ్‌బుల్ పాత్రలో ప్రేక్షకులను భయపెట్టాడు…
చిత్ర బలహీనతలు
కామెడీ ట్రాక్‌తో అలీ క్యారెక్టర్ పెంచి స్టోరీని డైవర్ట్ చేయడం…
అక్కడక్కడా ల్యాగ్ సీన్స్…
గెటప్ శీను ఉన్నా అతనికి తగ్గ కామెడీ ట్రాక్ లేకపోవడం…
సంజయ్‌దత్ క్యారెక్టర్‌ను క్రమక్రమేనా వీక్ చేసేయడం…
(గమనిక – ఈ మూవీ రివ్యూ సదరు ప్రేక్షకుల అభిప్రాయ పరిధిలోనివి మాత్రమే)
రేటింగ్ 3/3