తెలుగు సినీ పరిశ్రమలో అజాతశత్రువు ఎవరంటే కృష్ణంరాజు పేరు ముందు చెబుతారు. ఆయన నటనలో రెబల్ స్టార్ అయినా…మంచి మనిషిగా రియల్ స్టార్ అనిపించుకున్నారు. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా సొంతూరు మొగల్తూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు. కృష్ణంరాజు గురించి మాట్లాడే వారంతా ముందు ఆయన మంచి మనసు గురించి, స్నేహానికి విలువ ఇచ్చే తత్వం గురించి, విలువ పాటించి జీవించిన ఆయన వ్యక్తిత్వం గురించే చెబుతారు.
చిలకా గోరింక సినిమాతో హీరోగా కృష్ణంరాజు నట ప్రయాణం మొదలైంది. విలన్ గా, హీరోగా, మళ్లీ విలన్ గా, హీరోగా, నిర్మాతగా..ఇలా వైవిధ్యంగా ఆయన కెరీర్ సాగింది. సొంత బ్యానర్ గోపీకృష్ణా మూవీస్ లో చేసిన కృష్ణవేణి సినిమా సూపర్ హిట్ కావడంతో కృష్ణం రాజు హీరోగా, నిర్మాతగా గట్టి పునాది వేసుకోగలిగారు. ఇక ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చరిత్ర ఒక బొబ్బిలి బ్రహ్మణ్ణ, త్రిశూలం, భక్త కన్నప్ప..ఇలా వరుస సూపర్ హిట్స్ తో సాగింది.
ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలో చివరిసారిగా తెరపై కనిపించారాయన. 2022 సెప్టెంబర్ 11న హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా…రెబల్ స్టార్ గా ఆయన ఎప్పుడూ ప్రేక్షకులతోనే ఉంటారు.