అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. నంది అవార్డులు ఒక చరిత్రగా మిగిలిపోయాయి అన్నారు. మళ్లీ సినిమా వాళ్లకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఆహ్వానించదగినది అన్నారు చిరంజీవి. ఇవాళ హైదరాబాద్ శిల్పారామంలో పద్మ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం చేసింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి పాల్గొన్నారు.
పద్మ అవార్డ్ గ్రహీతలకు ప్రభుత్వం సన్మానం చేయడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని చిరంజీవి చెప్పారు. పద్మవిభూషణ్ అవార్డ్ లు దక్కిన తర్వాత తనకు దక్కుతున్న ప్రశంసలు చూస్తుంటే జీవితానికి ఇది చాలు అనిపిస్తోంది. తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే తనకు ఇంత గౌరవం దక్కేలా చేసిందని చిరంజీవి అన్నారు. ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయల బహుమతిని చిరంజీవి స్వీకరించారు.