దర్శకుడు రాజమౌళిపై హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించారు. రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ తనకు ఎంతగానో నచ్చిందని కామెరూన్ పేర్కొన్నారు. శాటర్న్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న జేమ్స్ కామెరూన్ లోకల్ మీడియా అడిగి ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు నిజాయితీగా తన అభిప్రాయాన్ని రాజమౌళికి చెప్పానని, ఆ సినిమాను రూపొందించిన విధానం తనను ఆకట్టుకుందని కామెరూన్ చెప్పారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా ప్రపంచ ప్రేక్షకులకు చేరువైందని, ఇండియన్ సినిమా గ్లోబల్ గా గుర్తింపు పొందడం మంచి విషయమని కామెరూన్ అన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్ పొందింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. అప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన ఆర్ఆర్ఆర్, ఆస్కార్ గెలుపుతో ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది.