జానీమాస్టర్‌కు ప్రతికూల పరిస్థితులు..?
బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..!
రేప్ అండ్ పోక్సో కేసులో అరెస్ట్ అయిన జానీమాస్టర్‌కు పరిస్థితులు అనుకూలించేలా లేవు. రంగారెడ్డి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టులో సోమవారం ఆయన బెయిల్‌పిటిషన్ విచారణకు రాగా…నార్సింగి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. విచారణ సమయంలో బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను అక్టోబర్ 7కు ధర్మాసనం వాయిదావేసింది.
తనను జానీమాస్టర్ రేప్ చేశాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగి పీఎస్‌లో కంప్లైంట్ చేయడంతో తొలుత దుమారం రేగిన విషయం తెలిసిందే. జానీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రేప్ కేసుతోపాటు పోక్సో కేసు కూడా నమోదైంది. మరోవైపు మొన్నామధ్య నాలుగురోజుల కస్టడీకి పోలీసులు అనుమతించడంతో జానీని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే జానీ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారని సమాచారం. పైగా, తనపై ఎవరో కావాలనే ఆ అమ్మాయితో ఇరికించే ప్రయత్నం చేశారని, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చెప్తున్నదంతా అబద్ధమని పోలీస్ కస్టడీలో జానీమాస్టర్ చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, పోలీసుల విచారణలో జానీ నేరాన్ని ఒప్పుకోలేదని, అలాంటి వార్తలన్నీ అవాస్తవమని జైలులో జానీని కలిసిన అనంతరం ఆయన భార్య అయేషా చెప్పిన విషయం వెలుగుచూసింది.