మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్‌ఫాల్కే అవార్డు
జీవితం ఎప్పుడూ సాఫీగా సాగలేదన్న నటుడు
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించిన సందర్భంగా ప్రారంభ దశలో తన పడ్డ కష్టాలను మీడియాకు పంచుకున్నారు. ఒకప్పుడు ముంబైలో ఉన్న తాను తినడానికి కూడా ఇబ్బందులు పడ్డానని, కారులో పడుకునేవాడినని, ఆ టైమ్‌లో భవిష్యత్తుపై చాలా భయంవేసిందని, అయితే ఈరోజు ఇంత పెద్ద గౌరవం తర్వాత కూడా తనకు ఎవరూ లేరనే భావిస్తున్నానని అన్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును తన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరికీ అంకితం చేస్తున్నానని డిస్కో డ్యాన్సర్ తెలిపారు.
దాదాపు 76 చిత్రాల తర్వాత కానీ తన లైఫ్ ఓ కొలిక్కిరాలేదన్నారు మిథున్ చక్రవర్తి. తాను జీవితంలో ప్రతీదానికి పోరాడాల్సి వచ్చిందన్న ఆయన…ఇలాంటి పురస్కారాలు వరించడంతో జీవితంలో పడ్డ బాధలన్నింటినీ మరిచిపోతామని తెలిపారు.
ఇక జయప్రద మాట్లాడుతూ…మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తనకు ఆనందంగా ఉందని తెలిపింది. మిథున్ మహానాయకుడు కాబట్టి ఇది యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీవారందరికీ గర్వకారణంగా కొనియాడారు. మిథున చక్రవర్తి ఈ గౌరవాన్ని అందుకోవడం ప్రత్యేకంగా తనకు మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు జయప్రద. రాబోయే రెండు చిత్రాలు రివాజ్, ఫౌజీలలో తామిద్దరం కలిసి నటిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నవారిలో 54వ వ్యక్తిగా మిథున్ చక్రవర్తి నిలిచారు. 1969 నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానోత్సవం జరుగుతూ వస్తోంది. ఇప్పటికే పృథ్వీరాజ్ కపూర్, వినోద్ ఖన్నా, రాజ్‌కపూర్, శశికపూర్, లతా మంగేశ్కర్, ఆశా భోంస్లే, బీఆర్ చోప్రా, యష్ చోప్రా వంటి దిగ్గజ నటులు, నటీమణులు ఈ అవార్డును అందుకున్నారు. 2021లో వహీదా రెహ్మాన్‌కు ఈ అవార్డు వరించింది.
సీతారామం దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఫౌజి చిత్రంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి యాక్ట్ చేస్తుండటం మరో విశేషం.