నటుడు, నిర్మాత మోహన్ బాబు అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం. గతంలో తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత టీఆర్ఎస్ కు అనుకూలంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వెంట, ఆ తర్వాత పార్టీ సంక్షోభంలో చంద్రబాబు వెంట ఉన్నారు. తెలంగాణ పోరాట సమయంలో మోహన్ బాబు కొడుకు నేను రోషమున్న తెలుగు వాడిని అంటూ ఉద్యమకారులపైకి గొడవకు వెళ్లిన వీడియోస్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంటాయి. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ దగ్గరకు వెళ్లి శాలువా కప్పి సీఎం మనోడే అనే ఇండికేషన్స్ ఇచ్చారు మోహన్ బాబు.
ఇవాళ మోహన్ బాబు ప్రెస్ మీట్ పెట్టారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఛైర్మన్ గా ఉన్న ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం చెప్పేందుకు మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీనే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి స్థలాలు ఇచ్చి ప్రోత్సహించిందని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి భార్య లక్ష్మికి దైవసన్నిధానం కమిటీ వైస్ ఛైర్మన్ పదవిని ఇస్తున్నట్లు చెప్పారు.