తన లేటెస్ట్ మూవీ నా సామి రంగతో బాక్సాఫీస్ వద్ద గౌరవప్రదమైన వసూళ్లతో బయటపడ్డారు నాగార్జున. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ సినిమా రిలీజైంది. పండగ సీజన్ కాబట్టి సినిమాలో లోపాలు ఉన్నా…బీ, సీ సెంటర్స్ ఆదరణతో గట్టెక్కింది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన నా సామి రంగ సక్సెస్ మీట్ లో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు నాగార్జున. ఈ సినిమా ప్రారంభోత్సవం నాడు సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేద్దామనుకుంటున్నామని చెబితే తన కుటుంబ సభ్యులే నమ్మలేదు అని తెలిపాడు. మొత్తానికి సినిమా సక్సెస్ పట్ల తన సంతోషాన్ని వెల్లడించారు నాగ్.
నాగార్జున మాట్లాడుతూ – సెప్టెంబర్ 20 నాన్నగారి పుట్టిన రోజున విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత అదే రోజున ఈ సినిమా మొదలుపెట్టాం. సినిమా ఓపెనింగ్ జరుగుతుందని మా ఫ్యామిలీ ఎవరికీ తెలీదు. షూటింగ్ కి బయలుదేరుతుంటే ఎక్కడికని అమల అడిగింది. ‘సినిమా మొదలుపెట్టాలి, వెళ్ళాలి’ అన్నాను. ‘సాయంత్రం వెళ్ళొచ్చు కదా’ అంటే.. ”సంక్రాంతికి విడుదల చేయాలి. త్వరగా వెళ్ళాలి’ అన్నాను. అప్పుడు అందరూ నన్ను బిత్తరమొహాలు వేసుకొని చూశారు ‘సంక్రాంతి విడుదల అంటున్నారు, ఏమైనా పిచ్చెక్కిందా’ అని పిల్లలతో సహా అందరూ అన్నారు. సినిమా మొదలుపెట్టిన తర్వాత సంక్రాంతి వస్తుందనే నమ్మకం బయట ఎవరి మొహాల్లో లేదు. కానీ నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం వుంది. మా నమ్మకం నిజమైయింది. విజయవంతంగా విడుదల చేశాం. అనుకున్న సమయానికి పూర్తి కావడానికి కీరవాణి గారు ఒక ప్రధాన కారణం. ఆయన ఒక టైం టేబుల్ వేసి మా అందరినీ ప్రోత్సహించారు. అని చెప్పారు.