నాంపల్లి కోర్టులో మంత్రి కొండాపై ‘పరువునష్టం’ విచారణ
వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున, సుప్రియ
రాజకీయ లబ్ధికోసం, తన కుటుంబాన్ని రోడ్డుకు లాగారని మంత్రి కొండా సురేఖపై ఘాటుగా స్పందించిన అక్కినేని నాగార్జున..ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. పైగా ఆమెపై క్రిమినల్ కేసు నమోదుచేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. ఇప్పటికే ఈ కేసులో తొలిదఫా విచారణ ప్రారంభించిన ధర్మాసనం…పిటిషనర్‌ను కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మలివిడత విచారణ మంగళవారం ప్రారంభంకాగా…నాంపల్లి కోర్టుకు నేరుగా నాగార్జున, అలాగే ఆయన ఫ్యామిలీ మెంబర్‌గా సుప్రియ హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
చదవండి: జానీమాస్టర్‌కి ఒక రూల్.. యడ్యూరప్పకు మరో రూలా..?
కోర్టులో నాగార్జున ఏమన్నారంటే..?
తన కుటుంబంతోపాటు చైతూ-సామ్‌ల విడాకుల అంశంపై మంత్రి కొండాసురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని నాంపల్లి కోర్టుకు నాగార్జున వాంగ్మూలం ఇచ్చారు. భార్య అమల, కుమారుడు నాగచైతన్యతో కలిసి కోర్టుకు హజరైన నాగార్జున…రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని…ఆమె మాట్లాడిన మాటలు అన్నిఛానళ్లు, పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయని తెలిపారు. తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు నాగార్జున స్టేట్‌మెంట్‌ను ధర్మాసనం రికార్డుచేసింది.
నాంపల్లి కోర్టులో సుప్రియ ఏమన్నారో తెలుసా..!
మాజీ మంత్రి కేటీఆర్ వల్ల చైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని…కేటీఆర్ వద్దకు సమంతను పంపించాలని అడిగితే దానికి సమంత ఒప్పుకోలేదని, అందుకే విడాకులు తీసుకుందన్న మంత్రి కొండా సురేఖ మాటలు విని… మా ఫ్యామిలీ అంతా షాక్‌కు గురైందని తెలిపారు సుప్రియ. మంత్రి హోదాలో చేసిన సురేఖ వ్యాఖ్యలు ఇటు ఛానళ్లు, అటు పత్రికల్లో కూడా వచ్చేశాయి. మంత్రి వ్యాఖ్యల కారణంగా మా కుటుంబం ఎంతో మనోవేధనకు గురైందని న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చారు సుప్రియ. నాగార్జున వేసిన పరువునష్టం దావా కేసులో మంగళవారం విచారణ ప్రారంభించిన ధర్మాసనం..ఇటు నాగార్జున, అటు సుప్రియల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. తదుపరి విచారణను 10వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
నాగార్జునపై పరువునష్టం దావా వేస్తాం
స్పష్టం చేసిన సురేఖ తరఫు న్యాయవాది
చెరువులను కబ్జాచేసి కట్టిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసామన్న అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై నాగార్జున కక్షగట్టారని మంత్రి కొండా సురేఖ తరఫు లాయర్ అన్నారు. నాగార్జునపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని న్యాయవాది తెలిపారు. అఫైర్ల గురించి కేటీఆర్, కేసీఆర్‌కు బాగా తెలుసునని న్యాయవాది వ్యాఖ్యానించారు.
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో నాగ్ వేసిన పరువునష్టం దావా కేసు మంగళవారం విచారణకు వచ్చిన నేపథ్యంలో కొండా సురేఖ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడారు.
నాగ్‌చైతన్య-సమంత విషయంలో నాగార్జున గురించి మాట్లాడిన మంత్రి కొండా సురేఖ…తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు మీడియా ముఖంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా లాయర్ గుర్తుచేశారు. బీసీ మంత్రి కొండా సురేఖపై, అలాగే రేవంత్ సర్కార్‌పై బురదజల్లే ఉద్దేశంతోనే నాగార్జున పరువునష్టం దావా వేశారని ఆరోపించారు. టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన తాము నాగార్జున గురించి అన్నివిషయాలను ఆర్‌బీఐ నుంచి సేకరిస్తున్నామని తెలిపారు. నాగార్జున వేసిన పరువునష్టం దావాలో ఏమీ లేదన్న కొండాసురేఖ తరఫు న్యాయవాది…పక్కా ఆధారాలతో నాగార్జునపై పరువునష్టం దావా వేస్తామని ఉద్ఘాటించారు. కాగా, మంగళవారం నాగార్జున, సుప్రియల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన ధర్మాసనం…తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.