నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వివేక్ ఆత్రేయ ఈ మూవీ డైరెక్టర్. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న సరిపోదా శనివారం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. నాని తదుపరి చిత్రాల గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇంత వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇంతకీ.. నాని నెక్ట్స్ ఏంటి..?
దసరా అంటూ ఊర మాస్ మూవీ చేసి ఆతర్వాత హాయ్ నాన్న అంటూ క్లాస్ మూవీ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇప్పుడు క్లాస్, మాస్ కలిపి సరిపోదా శనివారం అంటూ విభిన్న కథా చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాతో నాని మరోసారి సక్సెస్ సాధించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక నాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. బలగం వేణుతో నాని సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని క్లారిటీ వచ్చింది.
దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలాగే హిట్ 3 లో నటించేందుకు నాని ఓకే చెప్పాడు. శైలేష్ కొలను స్టోరీ చెప్పడం.. ఆ కథ విని నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించబోతున్నాడు. ఈ విషయాన్ని నాని స్వయంగా ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. అంతే కాకుండా నెక్ట్స్ చేయబోయే సినిమా ఇదే అని.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందని కూడా ప్రకటించారు. ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేస్తాడని టాక్. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత సుజిత్ తో నాని సినిమా ఉంటుందట. ఈ సినిమాలు సక్సెస్ అయితే.. నేచురల్ స్టార్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.