తన కొత్త సినిమా అన్నపూరణి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది స్టార్ హీరోయిన్ నయనతార. ఆమె 75వ సినిమాగా థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా నెలరోజుల్లోపే నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే అంశాలు ఉన్నాయంటూ కోర్టులో కేసు నమోదైంది. దీంతో ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించారు. ఈ విషయంపై స్పందించింది నయనతార. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తమకు లేదని, కొందరు ఇలా బాధపడతారని ఊహించలేదని నయనతార చెప్పింది.
తన ఇన్నేళ్ల కెరీర్ లో ఏరోజూ ఎవరినీ ఇబ్బంది పెట్టేలా సినిమాలు చేయలేదని, సొసైటీలో పాజిటివిటీ స్ప్రెడ్ చేసేలా సినిమాలు ఎంచుకున్నానని ఆమె అంది. అన్నపూరణి సినిమాతో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా..వారికి క్షమాపణలు చెబుతున్నట్లు నయనతార పేర్కొంది. అన్నపూరణి సినిమాను ట్రిడెంట్ ఆర్ట్స్, నాడ్ స్టూడియోస్, జీస్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు నీలేష్ కృష్ణ రూపొందించారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చెఫ్ గా మారి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించడం, అక్కడ నాన్ వెజ్ వంటకాలు చేయడం వంటి కథలోని అంశాలు వివాదాస్పదం అయ్యాయి.