సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది ఇంకా ప్రకటించలేదు. అయితే.. ఈ భారీ, క్రేజీ మూవీ టైటిల్ అంటూ ఆమధ్య ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ.. ప్రచారంలో ఉన్న టైటిల్ ఏంటి..? ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించే సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే అని ప్రకటించారు. మహేష్ కూడా జక్కన్నతో చేసే సినిమా కోసం కసరత్తు చేస్తున్నాడు. యాక్షన్ సీన్స్ కోసం ట్రైనింగ్ తీసుకోవడం.. గెడ్డం, హెయిర్ పెంచడం.. వర్క్ షాప్స్ లో పాల్గొనడం చేస్తున్నాడు. ఈ అడ్వంచరస్ మూవీకి విజయేంద్రప్రసాద్ కథ అందించారు. అయితే.. ఈ మూవీకి మహరాజ్ అనే టైటిల్ అనుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే.. మహేష్ పేరులోని మూడు ఇంగ్లీషు అక్షరాలు.. రాజమౌళి పేరులోని మొదటి మూడు ఇంగ్లీషు అక్షరాలు కలిపి మహరాజ్ అని పెట్టాలి అనుకున్నారట. అయితే.. విజయ్ సేతుపతి ఇదే టైటిల్ తో సినిమా చేయడంతో ఈ టైటిల్ ని పక్కనపెట్టేస్తారని తెలిసింది.
చదవండి: పవన్ కళ్యాణ్ & అల్లు అర్జున్ మధ్య గ్యాప్ కు కారణం అదేనా !!
తాజాగా ఈ భారీ పాన్ వరల్డ్ మూవీకి గరుడ అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. రాజమౌళి ఒకప్పుడు గరుడ అనే టైటిల్ తో సినిమా చేయాలి అనుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే చెప్పడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ టైటిల్ అన్ని భాషల వాళ్లకు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టైటిల్ తోనే సినిమా ఉంటుంది అంటూ ప్రచారం ఊపందుకుంది. మరి.. ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే.. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ మూవీని ప్రారంభిస్తారని తెలిసింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ అండ్ ఓపెనింగ్ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.