అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు మూవీ టీమ్ టార్గెట్ పెట్టుకుంది. మే వరకు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. ఆగస్టు 15న పుష్ప2 ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ కు కంఫర్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ చేసుకోవాలంటే మే చివరి కల్లా పుష్ప 2 షూటింగ్ చేసుకోవాలని భావిస్తున్నారట.
పుష్ప సినిమాకు వచ్చిన ప్రేక్షకాదరణ, దేశవ్యాప్తంగా ఈ సినిమా సాధించిన రికార్డులు, జాతీయ స్థాయిలో పొందిన అవార్డులతో పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ అంచనాలను అందుకునేలా మేకింగ్ లో మరింత భారీతనం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.