రవితేజ చేయాల్సిన సినిమా బాలీవుడ్ హీరో చేతికి చిక్కింది. ఆ సినిమా ఇవాళ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజతో తన నాలుగో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. వీరి కాంబోలో వచ్చిన బలుపు, డాన్ శీను, క్రాక్ మంచి హిట్స్ అయ్యాయి. దాంతో నాలుగో సినిమా గతంలో అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాను నిర్మించాలనుకుంది.
అయితే బడ్జెట్ విషయంలో ఏకాభిప్రాయం కుదరక ఆ చిత్రాన్ని పక్కనపెట్టేశారు. ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ను తీసుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండటం విశేషం. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన మూవీ లాంఛింగ్ లో హీరో సన్నీ డియోల్ తో పాటు హీరోయిన్స్ రెజీనా కాసాండ్ర, సయామీ ఖేర్ పాల్గొన్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ సినిమా తెరకెక్కనుంది.