కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ హీరోగా ఎదుగుతున్నారు సుహాస్. ఆయన కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఈ క్రమంలో సుహాస్ కొత్త సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. వచ్చే నెల 2న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
ఇవాళ రిలీజ్ చేసిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి సినిమా మీద అంచనాలు పెంచుతోంది. అంబాజీపేటలో బార్బర్ గా ఉంటూ బ్యాండ్ లో పనిచేస్తుంటాడు మల్లి. అతను ఆ ఊరిలోని అందమైన అమ్మాయి లక్ష్మిని ప్రేమిస్తాడు. వీరి కులాలు వేరు. దాంతో గొడవలు మొదలవుతాయి. మధ్యలో ఊరి టీచర్ ను వేధించే మరికొన్ని క్యారెక్టర్స్ చూపించారు. మల్లి తనకు జరిగే అన్యాయాలను ప్రశ్నించడం, పోలీసులు, సొసైటీ డబ్బున్న విలన్ వైపే సపోర్ట్ చేయడం ట్రైలర్ లో చూపించారు. మన ప్రేమ నీ ప్రాణం మీదకు తేకూడదు మల్లి అనే హీరోయిన్ ఎమోషనల్ డైలాగ్స్ తో ట్రైలర్ ముగిసింది. ఒక సహజమైన ఊరి వాతావరణంలో రూపొందించిన “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ప్రేక్షకులకు రియలిస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టోరీని చూపించబోతోందని ట్రైలర్ తో తెలుస్తోంది.