కమిటీ కుర్రోళ్లు చిత్రం అంచనాలకు మించిందనే చెప్పాలి. నిర్మాతగా నిహారిక కొణిదలకు, డైరెక్టర్‌గా యదు వంశీకి ఇదే తొలిచిత్రం. సొంతూళ్లు, పైగా పల్లెటూళ్ల వాతావరణం విడిచి సిటీలో స్థిరపడ్డవారందరికీ మళ్లీ వాళ్ల మట్టివాసనను చూసినట్టు ఉంటుంది ఈ చిత్రం. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. కథ, కథనంలో లోపం ఎక్కడా కనపడలేదు. రెండున్నర గంటలపైగా నిడివిగల ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అనిపించేలా ఉందన్నది ప్రేక్షకుల మాట. పెద్ద స్టార్‌డమ్ లేని క్యాస్టింగ్, అంటే దాదాపు అంతా కొత్తముఖాలతో చిత్రీకరించిన ఈ సినిమా ఆద్యంతం కామెడీ, మరీ ముఖ్యంగా భావోద్వేగాలతో పలుసీన్లలో కంటతడిపెట్టించే సన్నివేశాలతో… బలగం సినిమాలాంటి మూవీని మళ్లీ చూశామంటున్నారు వ్యూయర్స్. 1980 నుంచి 2000 ఏడాది మధ్య పల్లెటూళ్లలో బాల్యం గడిపిన వారందరికీ ఈ చిత్రం మంచి మధురానుభూతిని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేనే లేదు.
ఇక కథ విషయానికి వస్తే…గోదావరి జిల్లాలోని పురుషోత్తంపల్లి అనే గ్రామంలో కుర్రకారు గొడవలతో… పుష్కరానికి ఓసారి వచ్చే గ్రామదేవత భరింకాళమ్మ బలిచేట ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంటుంది. అదే కొట్లాటలో పూజారి కొడుకు ఆత్రం లోతైన కాలువలో పడి చనిపోతాడు. అయితే నిత్యం ఆడుతూ పాడుతూ తిరిగే మంచి స్నేహితుల మధ్య వైరం ఎందుకొచ్చింది? చంపుకునేంత వరకు వెళ్లడానికి కారణమేంటి? ఆ రోజు జరిగిన గొడవ తర్వాత మళ్లీ వాళ్లు ఎప్పుడు కలుసుకున్నారు? మళ్లీ 12 ఏళ్ల తర్వాత వచ్చిన అమ్మవారి జాతరను మళ్లీ వారందరూ కలిసి ఎలా విజయవంతంగా పూర్తిచేశారు? సర్పంచ్ ఎన్నికల్లో బుజ్జి(సాయికుమార్)ని ఓడించేందుకు శివ (సందీప్ సరోజ్) ఎలా ముందుకెళ్తాడు…చివరికి ఏం జరుగుతుందనేదే ఈ చిత్ర కథాంశం.
చిత్ర బలాబలాలు – కొత్త కథ…ల్యాగ్ లేని కథనం…డైలాగులు, వాటి మధ్య పంచ్‌లు…పెద్దోడు క్యారెక్టర్‌లో ప్రసాద్ బెహరా ఆద్యంతం కామెడీ పండించడం…ఎమోషనల్ సీన్లలో అంతే విధంగా ఏడిపించడం…సాయికుమార్, శ్రీలక్ష్మీ, గోపరాజు రమణ, కంచరపాలెం కిషోర్ వంటి నటనానుభవం ఈచిత్రానికి మంచి అస్సెట్ కాగా…మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అందించిన బాణీలు మరింతగా ఆకట్టుకున్నాయి.
బలహీనతలు – ప్రథమార్థంలో ఊళ్లో శివ గ్యాంగ్ మధ్య రేగిన రిజర్వేషన్ల చిచ్చుని ద్వితియార్థానికి వచ్చేసరికి సరైన ముగింపు ఇవ్వకపోవడం…కుర్రకారు మధ్య చిచ్చుని క్యాష్ చేసుకున్న బుజ్జి (సాయికుమార్) చివరికి సర్పంచ్ అయిపోవడం…దీనికి తోడు గెలవాలనే ఆశ, ఓడిపోతామన్న భయం లేనోడే నిజమైన నాయకుడని చివరికి చేతులెత్తేసి శివ చెప్పడం…అంతేకాదు కీలకమైన జాతర ఎపిసోడ్‌ని ఎలాంటి ఘర్షణలు, మలుపులు లేకుండా అర్థంతరంగా ముగించేయడం ప్రేక్షకులకి వెలితిలా అనిపిస్తుంది.
మొత్తానికి కమిటీ కుర్రోళ్లతో వచ్చిన శివ గ్యాంగ్ మాంచి మెసేజ్ ఇచ్చింది. డబ్బులే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతూనే..పరోక్షంగా 2019లో జనసేనాని పవన్ కల్యాణ్ రెండుచోట్లా ఇందుకే ఓడిపోయారనేలా నిర్మాత నిహారిక…తన బాబయ్ రాజకీయ జీవితాన్ని ఉద్దేశిస్తూ తెరకెక్కించడం కొసమెరుపు అంటున్నారు సిని విశ్లేషకులు.
(గమనిక – ఈ చిత్ర సమీక్ష ప్రేక్షకుల అభిప్రాయ పరిధిలోనిది మాత్రమే)