నటీనటులు – ఆకాష్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు
టెక్నికల్ టీమ్ : సంగీతం – శాండిల్య, నేపధ్య సంగీతం – సురేష్ బొబ్బిలి ఎడిటర్ – రాఘవేంద్ర వర్మ, నిర్మాత : కె రాఘవేంద్ర రావు, సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం : గంగనమోని శేఖర్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటించింది. “సర్కారు నౌకరి” చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించగా..గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఫస్ట్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది “సర్కారు నౌకరి” సినిమా. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
90 దశకం నేపథ్యంలో సాగే చిత్రమిది. మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ లో నివసించే ఒక మధ్య తరగతి కుర్రాడు గోపాల్ (ఆకాష్). తల్లిదండ్రులు లేకున్నా కష్టపడి చదువుకుని హెల్త్ వర్కర్ గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తాడు. సొంతూరిలోనే ఉద్యోగం వస్తుంది. సత్య(భావన)ను ఇష్టపడిన గోపాల్ స్నేహితుల సహాయంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. హెల్త్ వర్కర్ గా గోపాల్ కండోమ్స్ పంచడం, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడం వంటివి చేయాల్సివస్తుంది. ఎయిడ్స్ మీద అంతగా అవగాహన లేని ఆ కాలంలో గోపాల్ కండోమ్స్ పంచడాన్ని చులకనగా చూస్తుంటారు ఊరి జనం. సత్యకు, ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఇది చిన్నతనంగా అనిపిస్తుంటుంది. గోపాల్ ను ఈ హెల్త్ వర్కర్ ఉద్యోగం మానేయమని సత్య గొడవపెడుతుంది. పుట్టింటికి వెళ్లిపోతుంది. అయినా గోపాల్ తన వృత్తిని వదిలేయడు. గోపాల్ హెల్త్ వర్కర్ గానే ఎందుకు కొనసాగాలనుకున్నాడు. అతని నేపథ్యమేంటి, ప్రజలకు ఎయిడ్స్ పట్ల ఎలాంటి అవగాహన కల్పించాడు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు శేఖర్ గంగనమోని “సర్కారు నౌకరి” చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లే స్థానిక ప్రజలు..అక్కడ తెలియక తప్పులు చేసి ఎయిడ్స్ బారిన పడేవారు. అలా ఊరికి తిరిగి వచ్చిన వారిని సమాజం నుంచి వెలివేసేవారు. ఎయిడ్స్ మీద ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉండేవి. వాటిపై అవగాహన కల్పించేందుకు కొందరు ప్రభుత్వ అధికారులు చేసిన ప్రయత్నాలు, సమాజం నుంచి వారు ఎదుర్కొన్న వ్యతిరేకత..వంటి అంశాన్నీ ఇన్స్ పిరేషన్ గా తీసుకుని దర్శకుడు శేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఎయిడ్స్ ఇప్పుడు మన సమాజంలో అంతగా లేకున్నా..అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు. సత్యతో గోపాల్ పెళ్లి, గోపాల్ ఉద్యోగరీత్యా కండోమ్స్ పంచడం, వాటితో పిల్లలు ఆడుకోవడం..ఇలా “సర్కారు నౌకరి” సినిమా వినోదాన్ని అందిస్తూ ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. గోపాల్ ను కించపరిచేలా ఊరి జనం మాట్లాడటం నచ్చని సత్య….భర్తకు దూరమవడం కథలో సంఘర్షణ తీసుకొస్తుంది. తన వృత్తి కోసం, ప్రజల కోసం స్థిరంగా నిలబడిన గోపాల్ వ్యక్తిత్వం, అతని ఫ్లాష్ బ్యాక్ ఎమోషనల్ ఫీలింగ్ తీసుకొస్తాయి. సినిమాను ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది.
గోపాల్ క్యారెక్టర్ లో ఆకాష్ నటన మెప్పిస్తుంది. హీరోగా మొదటి సినిమానే అయినా ప్రతి సీన్ లో ఎంతో సహజంగా పర్ ఫార్మ్ చేశాడు ఆకాష్. ఎన్ని ఎమోషన్స్ లో సెటిల్డ్ గా కనిపించాడు. హీరోగా కంటే నటుడిగా గుర్తింపు పొందాలి అనే ఆకాష్ ప్రయత్నం “సర్కారు నౌకరి”తో నెరవేరినట్లే. సత్యగా భావన ఇంప్రెస్ చేస్తుంది. చూడగానే ఆకర్షించడమే కాదు నటనలోనూ మెప్పించింది. భరణి, ఇతర క్యారెక్టర్స్ కూడా కథలో భాగంగా సాగుతాయి. శాండిల్య కంపోజ్ చేసిన పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కథ ఫీల్ ను రెట్టింపు చేసింది. కొల్లాపూర్ పల్లె వాతావరణాన్ని ప్లెజంట్ గా క్యాప్చర్ చేశారు. మొత్తంగా “సర్కారు నౌకరి” ఒక రేర్ అండ్ డేర్ అటెంప్ట్ అని చెప్పుకోవాలి. అన్ని వర్గాల ఆడియెన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
రేటింగ్ 3/5