తెలుగు సినిమాకు నేషనల్ అవార్డ్ అందించిన చిత్రంగా శతమానం భవతి ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి గుర్తుండిపోతుంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు ఇదొక మెమొరబుల్ మూవీ అయ్యింది. శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన శతమానం భవతి సినిమాకు సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహించారు. నేషనల్ అవార్డ్ తో పాటు నంది అవార్డులనూ గెల్చుకుందీ సినిమా.
2017లో రిలీజైన ఈ సినిమాకు దాదాపు ఏడేళ్ల తర్వాత సీక్వెల్ వస్తోంది. శతమానం భవతి నెక్ట్ పేజ్ అంటూ ఈ సీక్వెల్ ను ప్రకటించారు. ఈ సంక్రాంతికి అనౌన్స్ అయిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ వెల్లడించారు మేకర్స్. నటీనటులు, దర్శకుడు ఎవరన్నది కూడా ప్రకటించలేదు. విదేశాలకు వెళ్లిన పిల్లలను చూడాలని తల్లిదండ్రులు ఎంతగా ఆరాటపడతారో ఈ సినిమాలో చూపించారు.