బన్నీతో జత కట్టిన శ్రీలీల
పుష్ప-2లో ఐటెం సాంగ్‌తో రచ్చ
సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప- ద రైజ్ దేశవ్యాప్తంగా ఎంత బిగ్ హిట్టో అందరికీ తెలిసిందే. పుష్పరాజ్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన అల్లు అర్జున్…తగ్గేదేలే అన్న డైలాగ్ సినిమాకు మించి ప్రాచుర్యం పొందింది. బేసిక్‌గా సుకుమార్ మూవీ అంటేనే ప్రతి క్యారెక్టర్ ఓ ప్రత్యేకం, ప్రతీ ఫ్రేమ్ ఓ గొప్పతనంగా ఉంటుంది. ఇక, తాను తీసిన సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్ ఉండాల్సిందే. సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అంటే… పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా వాడవాడలా ఇప్పటికీ మార్మోగిపోతుంటాయి. అంతలా ప్రేక్షకజనం ఖుష్ అయిపోతుంటారు సుకుమార్ సినిమాల్లో వచ్చే ఐటెం సాంగ్స్‌కి.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న పుష్ప- ద రూల్ చిత్రం డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే పార్ట్-1లో ఐటెం సాంగ్ చేసిన సమంతను ఎప్పటికీ మర్చిపోలేరు. అంతలా సాహిత్యం, దానికి తగ్గ నృత్యం ఆకట్టుకున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఐటెం సాంగ్స్‌కి సుకుమార్ ప్రయారిటీ ఇవ్వడమే కాదు…అద్యంతం దగ్గరుండి చాలా కేర్ తీసుకుంటారని మూవీ వర్గాలు చెబుతుంటాయి. ఇప్పుడు పుష్ప పార్ట్-2 దాదాపు చిత్రీకరణ అంతా పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మరోవైపు కొద్దోగొప్పో ఉన్న చిత్రీకరణపై ఫుల్ ఫోకస్ పెట్టింది చిత్రబృందం. ఇందులో మరీముఖ్యంగా ఐటెం సాంగ్ పెండింగ్‌లో ఉంది. అయితే పుష్ప-ద రూల్ చిత్రంలో బన్నీ సరసన ఐటెం సాంగ్స్‌లో ఎవరు తళుక్కుమంటారో అన్నది నిన్నటి వరకు సస్పెన్సే అయినా నేటికి అది రివీల్ అయిపోయింది.
ప్రముఖ వర్ధమాన నటి, డ్యాన్స్‌లో కుమ్మేస్తున్న శ్రీలీలను సుకుమార్ అప్రోచ్ అయ్యారట. దీనికి ఆమెకూడా సంతోషం వ్యక్తం చేస్తూ బన్నీతో తలపడాలని డిసైడ్ అయిందట. సో, రేపోమాపో బన్నీ-శ్రీలీల కాంబోలో ఐటెం సాంగ్ చిత్రీకరణ షురూ కాబోతుందని సమాచారం. ఈ ఐటెం సాంగ్‌కు చంద్రబోస్ సాహిత్యం అందివ్వగా దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ పాట హైఎండ్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతుందని పుష్ప- ద రూల్ మూవీ టీమ్ ధీమా వ్యక్తంచేస్తోంది.