అనంత విశ్వంలో ఎక్కడో ఓ గ్రహం దాని పేరు పాండోరా. ఆ గ్రహంలో నేవీ అనే ఓ తెగ జీవిస్తుంటుంది. అక్కడి ఖరీదైన ఖనిజ నిక్షేపాల కోసం మనుషులు వెళ్లి అక్కడి తెగ వారి జీవితాలను సర్వనాశనం చేస్తారు. జేమ్స్ కామెరూన్ తీసిన మాస్టర్ పీస్ అవతార్ కథా నేపథ్యమిది. తాజాగా రిలీజైన చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమా ట్రైలర్ చూస్తే అవతార్ లోని నేవీ తెగనే గుర్తుకొచ్చేలా ఉంది. ఇక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో దొరికే బంగారం కోసం బ్రిటీష్ దొరలు స్థానిక తెగలను ఉపయోగించుకుంటూ వారి మధ్యే గొడవలు సృష్టిస్తారు.
ఈ తెగల మధ్య పోరాటం రక్తసిక్తంగా మారుతుంది. ఇవన్నీ ఎంతో రా అండ్ రస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు పా రంజిత్. విక్రమ్, పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ లాంటి వాళ్లంతా గుర్తుపట్టలేనంత కొత్తగా ఈ సినిమాలో కనిపించారు. ట్రైలర్ లో విక్రమ్ బ్లాక్ పాంథర్ తో చేసిన ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు త్వరలోనే “తంగలాన్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందించగా..నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.