ప్రముఖ జర్నలిస్ట్, పీఆర్ఓ, నిర్మాత బీఏ రాజు 64వ జయంతిని ఇవాళ ఆయన మిత్రులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా, ఆయన పీఆర్ఓగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బీఏ రాజు…సూపర్ హిట్ సినిమా పత్రిక స్థాపించి సినిమా వార్తల పబ్లిషింగ్ లో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. ఆయన సూపర్ హిట్ లో వేసే డబుల్ పేజీ బ్లో అవుట్ లకు అభిమానుల్లో, స్టార్స్ లో క్రేజ్ ఉండేది.
పీఆర్ఓగా వందలాది సినిమాలకు పనిచేశారు బీఏ రాజు. ఆ సినిమాలకు మంచి ప్రచారం కల్పించి వాటి ఘన విజయాల్లో భాగమయ్యారు. నిర్మాతగా చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ వంటి హిట్ సినిమాలను నిర్మించారు. సినిమా పరిశ్రమలో ప్రతి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, టెక్నీషియన్ కు బీఏరాజు పర్సనల్ గా దగ్గరి మనిషి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పాత్రికేయులందరితో సొంత మనిషిలా మెలిగేవారు. ఆయన భౌతికంగా దూరమవడం సినీ పాత్రికేయ లోకానికే తీరని లోటు.