గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫియర్ సాంగ్, చుట్టమల్లె సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతున్నాయి. తాజాగా దేవర నుంచి థర్డ్ సింగిల్ విడుదల చేశారు. ఈ పాట రిలీజ్ చేసిన వెంటనే.. ఇదేం పాట దేవరా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం వైరల్ అయ్యింది. మరి… నిజంగా పాట బాలేదా..? లేక కావాలని కామెంట్స్ చేస్తున్నారా..?
దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ కు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించడమే కాకుండా పాట కూడా పాడాడు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా చాలా పవర్ ఫుల్ లిరిక్స్ తో ఈ పాట సాగింది. దేవర పాత్ర ఎంత బలమైనదో ఈ పాటలో చెప్పారు. అయితే.. దూకే ధైర్యమా జాగ్రత్త.. మృత్యువుకే ముచ్చెమట.. లాంటి పదాలు అతిశయంగా ఉన్నాయని కొంత మంది.. లిరిక్స్ సరిగా వినిపించడం లేదని మరి కొంత మంది కామెంట్స్ చేశారు. అయితే.. అనిరుథ్ నిరుత్సాపరిచాడు అనే టాక్ వినిపించింది కానీ.. వినగా వినగా ఈ సాంగ్ నచ్చేసింది.
చదవండి: 35 చిన్న కథ కాదు రివ్యూ
దేవర నుంచి రెండో పాటగా చుట్టమల్లే అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, జాన్వ కపూర్ పై ఈ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించారు. చుట్టమల్లే చుట్టేస్తాంది.. తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీలోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్నాపు.. అంటూ సాగే ఈ పాట విన్న వెంటనే జనాలకు నచ్చేసింది. ఈ పాట మత్తెక్కించేలా ఉందని కామెంట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఈ పాట శ్రీలంక సాంగ్ మనికే మాగే హితే పాటకు కాపీ అంటూ నెటిజన్లు విమర్శించారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటకు ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువు వచ్చాయి. అయినప్పటికీ ఈ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతుండడం విశేషం.
దేవర నుంచి రిలీజ్ చేసిన రెండు పాటలకు విమర్శలు వచ్చినా.. రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుండడం విశేషం. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. దావుడి అంటూ సాగే ఈ పాట రిలీజ్ కు ముందు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఓ రేంజ్ లో ఉంటుందని హైప్ క్రియేట్ చేశారు. అయితే.. పాట వింటుంటే దేవుడా.. కాదు కాదు.. దేవరా.. ఏంటి పాట అనేట్టుగా ఉందనే కామెంట్లు వచ్చాయి. కొంత మంది అయితే.. సోషల్ మీడియాలో రామజోగయ్య తాత మోసం చేశాడు అంటూ పాట బాగోలేదనే విషయాన్ని చెబుతున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు వేయడం.. ఎన్టీఆర్ కు దీటుగా జాన్వీ డ్యాన్స్ చేయడం బాగుంది. కాకపోతే పాటే ఏదోలా ఉంది. మరి.. ఈ పాటకు ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి మరి.