ఢిల్లీలో పాగా వేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ, ఆ తర్వాత పంజాబ్ పీఠాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో బరిలోకి దిగడం మరో విశేషం. ఇప్పటికే ఏడుగురు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రకటించేశారు కూడా. పుల్వామా, రాజ్‌పోరా, దేవ్‌సరు, దూరు, దోడా వెస్ట్, బనిహల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించి సై అంటున్నారు కేజ్రీవాల్.
స్టార్ క్యాంపెనర్లూ సిద్ధం..!
జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో పోటీకి దిగిన ఆప్ ..ఆ మేరకు 40మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రముఖంగా ఆ పార్టీ జాతియ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పార్టీ నేతలు మనీష్ సిసోడియా, ఆప్ మంత్రులు అతిషి, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్, ఎంపీ రాఘవ చద్దా తదితరులు ఉన్నారు.
చదవండి: ‘పెద్దా’యన బహిష్కరణ..?
అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న జమ్మూ ఎలక్షన్స్..?
మోదీ ప్రభుత్వం రెండోసారి గద్దెనెక్కాక 2019, ఆగస్టు 5న…రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 (D) రద్దుతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తిని కేంద్రం దూరంచేసింది. అలాగే జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను రద్దుచేసింది. మరోవైపు సదరు రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే రద్దుచేసిన రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తూ ఎన్నికల శంఖారావం పూరించింది కేంద్రం. కాగా, ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్‌ను ఆదేశించింది. మొత్తం 114 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్‌కు.. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో పోలింగ్ జరగబోతుండగా…అక్టోబర్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, పీసీతోపాటు ఇప్పుడు ఆప్‌కూడా బరిలో ఉండటంతో జమ్మూకశ్మీర్ గెలుపోటములపై దేశంమొత్తం ఎంతో ఆసక్తిగా చూస్తోంది.