పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత
ఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత తీసుకోవాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, పైగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరమేలేదని స్పష్టీకరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం, పోలీసు ఉన్నతాధికారులతో తానెప్పుడూ చర్చిస్తూనే ఉన్నానని, ఇందులో పవన్ కల్యాణ్ కూడా భాగమేనని అన్నారామె. పవన్ కల్యాణ్‌కు అన్నివిషయాలు తెలుసునని, ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తనకు తెలుసునని, త్వరలోనే ఆయనతో మాట్లాడతానని ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హోంమంత్రి అనిత.
కాగా, సోమవారం పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్న పవన్‌కల్యాణ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగంపై, మరీ ముఖ్యంగా హోంమంత్రి అనితను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఫైర్ అయిన విషయం విదితమే. గత ప్రభుత్వంలో శాంతిభద్రతలను పట్టించుకోని పోలీసులు, ఇప్పుడు ధర్మబద్ధంగా విధులు చేపట్టమని పదేపదే చెప్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచారాలకు హోంమంత్రి అనితదే బాధ్యతని నొక్కిఒక్కాణించారు. పొరపాటున పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా ఉన్నా, హోంమంత్రి పదవిలో ఉండి ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా పనిచేసి తానేంటో చూపించేవాడినని హెచ్చరించారు. ఈ విధంగా పవన్ ఫైర్ అవడంతో హోంమంత్రి అనిత పైవిధంగా స్పందించారు.