జగన్ అభిమాని శ్రీరెడ్డిపై మరో కేసు..!
గత ఐదేళ్ల పాలనలో జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన మహిళల్లో శ్రీరెడ్డి కూడా ఒకరు. ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చంద్రబాబు మరియు పవన్ కుటుంబసభ్యులను ఎంతలా నోరు పారేసుకున్నారో అందరికీ తెలిసిందే. చివరికి, రాజకీయాలతో సంబంధంలేని పవన్‌కల్యాణ్ మాతృమూర్తిపైనా అవాకులు, చవాకులు పేలి ఇటు జనసైనికుల నుంచి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇక లోకేశ్‌ను అయితే ప్రధానంగా పప్పు అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ వైసీపీ శ్రేణుల్లో ఒక వీరవనితగా ముద్రపడటమే కాదు, పరోక్షంగా టీడీపీ కార్యకర్తల గుండెల్లో అగ్గిరాజేశారు. అయితే ఎల్లకాలం టైమ్ ఒక్కరిదే నడవదు కనుక, ఇప్పుడా టైమ్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో టీడీపీకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు అయిన లగాయితూ వైసీపీ వాళ్లను చెడుగుడు ఆడుకుంటున్నారని ఓ టాక్ అయితే వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ఆ నేత, ఈ నేత అని చూడకుండా తప్పు చేసినవాళ్లని, అంతేవిధంగా తమ మనస్సు నొచ్చుకునేలా బిహేవ్ చేసినవాళ్లని వదలడమే లేదు. ఇప్పుడా లిస్ట్‌లో శ్రీరెడ్డి కూడా చేరిపోయింది.
హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శ్రీరెడ్డిపై టీడీపీ నేత మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో కేసు నమోదవగా…చంద్రబాబు, పవన్‌తోపాటు వాళ్ల కుటుంబసభ్యులపై ఇష్టానుసారం నోరుపారేసుకున్నారని మాజీ కార్పొరేటర్ దాసరి జ్యోతి కంప్లైంట్ చేయడంతో ఇటు గుంటూరు పోలీసులు తాజాగా మరో కేసు నమోదుచేయడం చూస్తుంటే… ఆమె మెడపై కత్తి వేలాడుతుందన్నది స్పష్టంగా తెలుస్తుంది. కాగా, శ్రీరెడ్డి ఈ మధ్యనే తనను క్షమించాలంటూ..పొరపాటు చేశానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయినా చట్టం తన పని చేసుకుపోతుందన్న చందాన ‘వదల బొమ్మాళి’ అంటూ శ్రీరెడ్డిపై కేసులు నమోదవడం చూస్తే…రేపటి రోజున కష్టాల కడలిని ఆమె ఈదబోతున్నారని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.