ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
బడ్టెట్ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నవంబర్ 11నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నాలుగు నెలలు పూర్తిచేసుకుని, ఐదోనెల కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే కూటమి సర్కార్ పాలన సాగించిన పరిస్థితి. తొలిదఫా సమావేశాలు కేవలం గవర్నర్ ప్రసంగం, స్పీకర్, ఛైర్మన్ ఎన్నిక, సభ్యుల ప్రమాణాస్వీకారాలతోనే పరిసమాప్తం అయింది. అయితే, నాటి నుంచి మలివిడత సమావేశాలు నిర్వహించలేదు. ఈ ప్రభుత్వానికి బడ్జెట్ సమావేశాలు పెట్టి పాలన సాగించే సత్తాలేదు, కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే నడిపిస్తుందంటూ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఇప్పటికే వైసీపీ మాటల తూటాలు పేల్చుతున్న వేళ…ఈ నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం సభలో కూటమి నేతలు , వైసీపీ సభ్యుల మధ్య వాగ్యుద్ధం ఎలా ఉంటుందో అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిశ్చయించుకున్నారట. పలు పధకాలకు నిధులు కేటాయింపులతోపాటు, పలు చట్ట సవరణ బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ఈనెలాఖరుతో ముగుస్తుంది కాబట్టే…తాజా అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకురాబోతుందని విశ్లేషకుల భావన. మరోవైపు, కేవలం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత జగన్…ఈ అసెంబ్లీ సమావేశాలకు పూర్తిగా హాజరై ప్రజాపక్షాన నిలబడి ప్రశ్నిస్తారా? లేదా తొలిదఫా సమావేశాల మాదిరిగా మొహం చెల్లక చాటేస్తారా అన్నది వేచిచూడాల్సిందే అంటున్నారు తలపండిన నేతలు.