గ్రామ పంచాయతీలకు మళ్ళీ మంచిరోజులు రానున్నాయి. సర్పంచ్‌లకు మళ్లీ అధికారాలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. పంచాయతీలకు మంజూరైన 14, 15 ఆర్థికసంఘం నిధులను వైసీపీ సర్కారు ఇతర అవసరాలకు దారిమళ్లించేది. దీంతో పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల్లా మారాయి. అయితే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని యోచిస్తోంది.
సచివాలయాలను గ్రామ పంచాయతీలతో అనుసంధానం చేసేలా అడుగులు వేస్తోంది. సర్పంచ్‌లకే పూర్తి అధికారాలు అప్పగించాలని భావిస్తోంది. జిల్లాలో 30 మండలాల పరిధిలో 912 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 647 సచివాలయాలు ఉన్నాయి. కార్పొరేషన్, మున్సిపాల్టీల పరిధిలో మరో 75 సచివాలయాలు (ఇచ్ఛాపురం-10, పలాస-16, ఆమదాలవలస-11, శ్రీకాకుళం-38)ఉన్నాయి. అయితే, ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. సచివాలయాల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉన్నా అందులో పనిచేసే ఉద్యోగులు వారి పరిధిలో లేకుండా పోయారు. వాటి పర్యవేక్షణను రెవెన్యూ శాఖకు అప్పగించింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం. కనీసం పంచాయతీ సాధారణ నిధులు ఖర్చు చేయడానికి కూడా అభ్యంతరాలు తెలిపింది. తమకు హక్కులు కల్పించాలని సర్పంచ్‌లు పలుమార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పాలకులు పట్టించుకోలేదు. దీంతో అటు సర్పంచులు కాని ఇటు పంచాయతీ కార్యదర్శులు గాని ఏమీ చేయలేకపోయారు.
నిధుల ఖర్చు విషయంలో జగన్ సర్కారు కట్టడి చేయడంతో పంచాయతీల్లో కనీస వసతులు సమకూర్చడానికి ఆపసోపాలు పడ్డారు. కొన్ని పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులకు వేతనాలను సకాలంలో చెల్లించలేకయారు. చిన్నచిన్న మరమ్మతు పనులకు బిల్లులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదాయం ఉన్న పంచాయతీలదీ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో పంచాయతీ వ్యవస్థకు గత వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పంచాయతీ రాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను పంచాయతీలకు అనుసంధానం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సర్పంచ్‌లకు అధికారం అప్పగించడం ద్వారా గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సత్వర సేవలు అందుబాటు లోకి తెచ్చేలా అడుగులు వేస్తోంది.