ఏపీ మందు బాబులకు ఇక పండగే పండగ..!
తెరుచుకున్న షాపులు – తిరిగొచ్చిన పాత బ్రాండ్లు..!
ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న మద్యం ప్రియుల ఆశలు నెరవేరాయి. వారి ఆకాంక్షలు ఫలించాయి. ఇచ్చిన హామీకి కట్టుబడి, నూతన మద్యం పాలసీతో మందుబాబుల గొంతు అతిచవకగా తడిపేలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో బుధవారం నుంచి పండగ వాతావరణం చోటుచేసుకుంది. అంతేనా, 2019కి ముందున్న బ్రాండ్లన్నీ ఒక్కసారిగా మద్యం దుకాణాల్లో తళతళమని మెరిసిపోవడంతో మందుబాబుల ఆనందానికి ఆవధుల్లేవు. మళ్లీ పాత మిత్రుణ్ని కలిస్తే ఎలా ఉంటుందో, ప్రియురాలిని చాలా కాలం తర్వాత చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో.. అలాంటి ఆనందం మందుబాబుల మోముల్లో చక్కగా కనిపిస్తోంది. బహుశా అందుకేనేమో, వారు అంతగా ప్రేమించి ఒంట్లో ఒలగబోసుకున్న బ్రాండ్లను జగన్ దూరం చేసేసరికి…మొన్నటి ఎన్నికల్లో తమనుంచి జగన్‌ను దూరంగా నెట్టేశారన్నది విశ్లేషకుల మాటగా వినవస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ శాపంతో మందుబాబులకు దూరమైన కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మాన్షన్ హౌస్, ఇంపీరియల్ బ్లూ లాంటి పాతబ్రాండ్లు చంద్రబాబు పుణ్యామాని మళ్లీ సాక్షాత్కరించాయి. ఇప్పుడు నగదు లేదా డిజిటల్ పేమెంట్‌తో మీరు కోరుకున్న లిక్కర్‌ను ఎంచక్కా పొందొచ్చంటున్నారు సీనియర్ తాగుబోతులు.
కాగా, జగన్ తీసుకొచ్చిన మద్యం పాలసీని రద్దుచేసి మళ్లీ ప్రైవేట్ ఆధ్వర్యంలో దుకాణాలను లాటరీ ద్వారా అప్పగించిన విషయం తెలిసిందే. దరఖాస్తు రుసుము నాన్ రిఫండబుల్ రూ.2లక్షల చొప్పున సుమారు 90వేల దరఖాస్తులు వచ్చిపడ్డాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.1,800 కోట్లు వచ్చిచేరింది. ఇక, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలకు మంగళవారంతో స్వస్తి పలకగా బుధవారం నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అవన్నీ వెళ్లిపోయాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 3,396 షాపులు తెరుచుకున్నాయి. ఎమ్మార్పీ ప్రకారమే ధరలు ఉండేలా చర్యలు తీసుకుంది బాబు సర్కార్. మరోవైపు క్వార్టర్ లిక్కర్ అత్యల్ప ధర రూ.99 ఉండటం గమనార్హం.