ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గం పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్లు దరఖాస్తు చేసిన పిన్నెల్లికి ప్రతిసారీ హైకోర్టు షాకివ్వగా.. శుక్రవారం మధ్యాహ్నం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 50 వేల రూపాయలతో రెండు పూచికత్తులు సమర్పించాలని పిన్నెల్లిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఆంక్షలు…ఆదేశాలు..!
పూచీకత్తులతో పాటు.. పాస్ పోర్టును సరెండర్ చేయాలని పిన్నెల్లిని హైకోర్టు ఆదేశించింది. ప్రతి వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలంది. ఎలాంటి అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని కూడా క్లియర్ కట్‌గా హైకోర్టు చెప్పింది. పిన్నెల్లి రిలీజ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కాగా, ఇదే కేసులో పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇంకా పరారీలోనే ఉండటం కొసమెరుపు.