గుడివాడ కొడాలిపై వైజాగ్‌లో కంప్లైంట్..!
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలపై నాడు అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలపై కేసులు, అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ…ఇప్పడా పార్టీనుంచి కీలకనేత, మాజీమంత్రి కొడాలి నానిపై కేసు నమోదవడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
జగన్ అధికారంలో ఉండగా కొడాలి నాని సోషల్ మీడియా వేదికగా బండబూతులు తిడుతూ కక్షపూరిత ధోరణికి తెరదీశారని విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీకి చెందిన లా స్టూడెంట్ అంజనప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక అమ్మాయిగా కొడాలి నాని తిట్లను భరించలేకపోయానని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. మేరకు విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నాడు టీడీపీని వీడి వైసీపీలో చేరిన కొడాలి నాని… గత వైసీపీ పాలనలో మంత్రిగానూ ఉన్నారు. పైగా చంద్రబాబు, లోకేశ్‌ను తిట్టాల్సివస్తే వైసీపీ నుంచి తొలివరుసలో అదే సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని ఎప్పుడూ ముందుండేవారు. నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడి ఇటు తండ్రీకొడుకులతో పాటు దత్తపుత్రుడంటూ అటు పవన్ కల్యాణ్‌ను సైతం దుర్భాషలాడిన సందర్భాలు కోకొల్లలు. జగన్‌పై ఉన్న స్వామిభక్తిని ఆ రకంగా కొడాలి నాని చూపేవారంటూ రాజకీయ పండితులు ఇప్పటికీ చెబుతుంటారు. ఏదేమైనా, తాజా కంప్లైంట్‌తో కొడాలి నానికి మున్ముందు గడ్డుకాలమే అంటూ రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.