బోరుగడ్డ అనిల్ అరెస్ట్..!
గుంటూరు నుంచి వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ యావత్ రాష్ట్రంలోని వైసీపీ శ్రేణులని షాక్ గురిచేసేలా చేసింది. నాటి జగన్ ప్రభుత్వం అండదండలతో నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసి వివాదాల్లో నలుగుతూ వచ్చిన బోరుగడ్డ అనిల్ అంటే… గత ఐదేళ్ల రాజకీయాలు తెలిసిన వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తాను వైఎస్ జగన్ వీర విధేయుడని చెప్పుకోవడమే కాదు, జగన్ ఆదేశిస్తే ఇటు చంద్రబాబుని, అటు పవన్‌కల్యాణ్‌ని చంపుతానని నాడు చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన పాలిట శాపాలుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పోలీసులకు కంప్లైంట్ వెళ్లడంతో కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం గుంటూరు పట్టాభిపురం పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్ కుమార్ ఉన్నట్టు సమాచారం.
కాగా, మంత్రి నారా లోకేశ్ ఎన్నికలకు ముందు రెడ్‌బుక్ పట్టుకుని ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ రెడ్ బుక్‌లో అందరి కేటుగాళ్ల పేర్లు ఉన్నాయని, తమ ప్రభుత్వం వచ్చాక రెడ్‌బుక్ ప్రకారం చట్టం తన పని తాను చేసుకుపోతుందని నాడు లోకేశ్ అన్న మాటలు ఇప్పుడు సాక్షాత్కరిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే, ప్రస్తుతం రాష్ట్రంలో పాలన పడకేసింది, లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రం నడుస్తోంది అంటూ వైసీపీ నేతలు స్లోగన్స్ వినిపిస్తున్నారు. రెడ్‌బుక్‌ను అనుసరించే 2021లో జరిగిన టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసాలపై దాడులను తెరపైకి తీసుకొచ్చి, ఇప్పటికే వైసీపీ కీలక నేతలను ఇబ్బందిపాలు జేస్తున్నారన్నది జగన్‌తోపాటు ఆయన పార్టీ నేతల ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే బోరుగడ్డ అనిల్ అరెస్ట్ కూడా… లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారమే జరిగిందన్నది వైసీపీ శ్రేణుల మాట.