దోషులపాలిట యమకింకరిణి…సీమా పహుజా..?
అభయ తల్లిదండ్రుల్లో న్యాయంపై విశ్వాసం..!
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన అభయ హత్యాచార కేసును బెంగాల్ హైకోర్టు సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. సీబీఐ, సీఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులంటూ దాదాపు ౩౦ మంది ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్, ఝార్ఖండ్ కేడర్‌కు చెందిన సంపత్ నెహ్రా సీబీఐ టీమ్‌కు నాయకత్వం వహిస్తుండగా…అందరి దృష్టి, మరీ ముఖ్యంగా అభయ తల్లిదండ్రుల విశ్వాసం ఆమెపైనే ఉంది. ఇంతకీ విచారణ టీమ్‌లో బాధిత కుటుంబాన్ని అంతగా ఆకర్షించిన ఆ అధికారిణి ఎవరన్నదానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆమెనే సీమా పహుజా. ఈమె ఉంటే చాలు న్యాయం కచ్చితంగా జరిగితీరుతుందన్న నమ్మకం ఇప్పుడు బెంగాల్ వేదికగా ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది.
ఎవరి సీమా పహుజా..ఏంటి ఈమెకున్న సత్తా..?
1993లో ఢిల్లీ పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా… సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ, స్పెషల్ క్రైమ్ యూనిట్‌లో చాలాఏళ్లు పనిచేసి ఇన్‌స్పెక్టర్‌గా, అలాగే 2013లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సమయంలో సీమా పహుజా మానవ అక్రమ రవాణా, మతమార్పిడి, హత్యలు, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను చేధించి నిందితులకు శిక్ష పడేలా చేశారు.
2018లో సిమ్లా కోథాయ్‌లో గుడియా హత్యాచారం కేసును ఛేదించి చాలా ప్రశంసలు పొందారు. వాస్తవానికి ఈ కేసు విచారణ శైలిని సీబీఐ అత్యుత్తమ దర్యాప్తుగా పరిగణించడం ఓ విశేషం. గుడియా ఘటన తర్వాత ఎన్నో హత్యాచార కేసుల దర్యాప్తు బృందంలో ఆమె సభ్యురాలిగా కూడా ఉన్నారు.
ప్రశంసలే కాదు ఎన్నో అవార్డులు సైతం సీమా పహుజా సొంతం. 2007లో హరిద్వార్ జంట హత్యలకేసు చేధించినందుకు మొదటి గోల్డ్ మెడల్…2014లో ఇండియన్ పోలీస్ మెడల్…2018లో కేంద్ర హోంమంత్రి ఎక్స్‌లెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డు…అదే ఏడాది గుడియా హత్యాచారం కేసుకు సంబంధించి రూ.50వేలు పురస్కారంతోపాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. కెరీర్‌లో ఇంతటి ఘనకీర్తిని సాధించి, పక్షపాతం లేకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా కేసు ఏదైనా బాధిత కుటుంబానికి న్యాయం చేసి, నిందితులకు శిక్షపడేలా చేయడమే సీమా పహుజా అసలు క్యారెక్టర్. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ఈమె… అభయ కేసులో సీబీఐ అధికారిగా ఉండటంతో తమకు న్యాయం కచ్చితంగా జరుగుతుందనే విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు బాధిత తల్లిదండ్రులు.