రిషికొండ ప్యాలెస్‌లోకి అందరికీ ఎంట్రీ: చంద్రబాబు
ప్యాలెస్‌ను దేనికి ఉపయోగించాలో తెలియడం లేదు: బాబు
అధికారంలో శాశ్వతంగా ఉండిపోతామన్న భావనలో నాటి సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు పోయారని, దానికి నిదర్శనం ఈ రిషికొండ ప్యాలెస్‌నేనని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక్క భవనం కోసం ప్రత్యేకంగా సబ్‌స్టేషన్, సెంట్రల్ ఏసీ, ఫ్యాన్సీ ఫ్యాన్లు ఎందుకున్న ఆయన…పేదలగురించి ఆలోచించే వారు ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా అంటూ ప్రశ్నించారు. రిషికొండలో పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యాక అందరినీ అనుమతిస్తామన్న సీఎం చంద్రబాబు…ప్యాలెస్‌ను దేనికి ఉపయోగించాలో అర్థం కావడం లేదని, అందరితో చర్చించాకనే ఓ నిర్ణయానికి వస్తానని తెలిపారు.
విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించిన చంద్రబాబు…భవనాలు చూశాక ఉద్వేగం, ఆశ్చర్యం కలిగాయని మీడియాకు చెప్పుకొచ్చారు. జగన్ ఎప్పుడూ పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటుంటాడు…పేదల పేరుచెప్పి ఇలాంటి విలాసవంతమైన భవనాలు ఎలా కడతాడని ప్రశ్నించారు. తాను కలలుగన్న అందమైన ప్యాలెస్ కోసం జగన్ నిబంధనలన్నీ ఉల్లంఘించాడని ఆరోపించారు. హైకోర్టును, ఎన్జీటీని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్యపెట్టాడని జగన్‌ను దుమ్మెత్తిపోశారు. రుషికొండ భవనాలపై కరెక్ట్‌గా విచారణ చేపడితే జగన్‌తోపాటు ఆయనకు సహకరించిన చాలామంది ఎగిరిపోతారని పరోక్షంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు.