వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులు..!
మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై రేప్ కేస్..!
బాపట్ల జిల్లా వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదు అయ్యాయి. కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగం ఇప్పిస్తానని మేరుగు నాగార్జున తన నుంచి రూ.90లక్షలు దండుకుని తిరిగివ్వలేదని విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. తనను బలవంతంగా శారీరకంగా అనుభవించాడని కంప్లైంట్‌లో బాధితురాలు పేర్కొంది. కాగా, మేరుగు నాగార్జునతోపాటు ఇదే కేసులో ఆయన పీఏపైనా కేసు ఫైల్ చేశారు తాడేపల్లి పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని అధికారిక వర్గాల సమాచారం.
గదిలో బంధించి నాలుగుసార్లు మాజీ మంత్రి రేప్..!
మాజీమంత్రిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన అనంతరం బాధితురాలు మీడియాతో మాట్లాడారు. తనకు మేరుగు నాగార్జునతో ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఈ క్రమంలోనే తనశాఖకు సంబంధించి కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని డబ్బులు దోచుకున్నాడని ఆరోపించింది. మరోవైపు… సార్ మీతో మాట్లాడతారంటూ ఆయన పీఏ మురళీమనోహర్‌రెడ్డి తనను నమ్మబలికి కుంచనపల్లిలో మాజీమంత్రి ఉండే నాగార్జున అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లేవాడని…నేను ఫ్లాట్‌లోకి వెళ్లగానే బయట తాళాలు వేసి వెళ్లిపోయేవాడని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో మేరుగు నాగార్జున తనను నాలుగుసార్లు శారీరకంగా వాడుకున్నాడని తెలిపింది. అంత బాధను దిగమింగుకుని నాకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వండని కోరినా…ఆయన పీఏ బెదిరించాడని చెప్పుకొచ్చింది. గట్టిగా మాట్లాడితే విశాఖలో ఓ గిరిజిన టీచర్‌ను స్లో పాయిజన్ ఇచ్చి చంపేసినట్లు…నిన్ను చంపేయాల్సి ఉంటుందని బెదిరించినట్లు పీఏపై ఆరోపణలు గుప్పించింది. చేసిన అప్పులు, బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐల ఒత్తిడి తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించానంటూ సదరు బాధితురాలు వాపోవడంతో ఇప్పుడు మాజీమంత్రి మేరుగు నాగార్జునతోపాటు బాపట్ల వైసీపీలో అలజడి రేగింది.