కడిగిన ముత్యంలా చంద్రబాబు..!
ఓటుకు కోట్లు కేసులో బిగ్ రిలీఫ్..?
పిటిషనర్ ఆళ్లకు సుప్రీం వార్నింగ్..!
ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని , కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లనూ ధర్మాసనం డిస్మిస్ చేసింది. సదరు పిటిషనర్ 2014 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటూ ధర్మసనానికి గుర్తుచేసిన చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూద్రా…ప్రస్తుతం ఆయనున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని నివేదించారు. కాగా, రాజకీయ కక్షసాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని మందలించిన జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం…ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
చదవండి: నాంపల్లి కోర్టుకు జగన్..?
నాడు జరిగింది ఇలా…!
2015లో ఈ ఓటుకు కోట్లు అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్‌కు జరిగే ఎన్నికల్లో ఒక నామినేటెడ్ శాసనసభ్యున్ని తెలంగాణ టీడీపీ ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా, ప్రస్తుత తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి…సదరు నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్‌సన్‌కు 50లక్షలు ఇస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అయితే డీల్ జరిగే సమయంలో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాడ్లాడిన ఆడియో టేప్ ఒకటి బహిర్గతం కావడంతో ఆ కేసు తాలూకా మరక ప్రస్తుత ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుకూ అంటింది. అయితే ఈ కేసు విషయంలో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ, ఈ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న రేవంత్‌రెడ్డి, ఇతర ముద్దాయిలకు నాడు ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, టీడీపీని లేకుండా చేయాలన్న రాజకీయకక్షతో బీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్సీపీ ఆడిన ప్రధాన డ్రామా అంటూ ఇప్పటికీ తెలుగుదేశం వాదిస్తోంది.