పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!
హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!
సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తూ మిత్రపక్ష టీడీపీలో అలజడి సృష్టించారు జనసేనాని, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్. టీడీపీ తరఫున హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న అనిత పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరోక్షంగా పోలీసుల పనితీరును దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి చెబుతూనే ఉన్నాను…లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలు చేయండని పదే పదే చెబుతున్నా…అయినా, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు గాలికొదిలేశారు, ఇప్పడేమో ధర్మబద్ధంగా పనిచేయమంటే ఆలోచిస్తున్నారు…ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారో తనకైతే అర్థంకావడంలేదని మండిపడ్డారు పవన్ కల్యాణ్.
నేను పంచాయతీరాజ్ శాఖామంత్రిని అయిపోయా…పొరపాటున హోంశాఖ తీసుకునిఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా ప్రవర్తిస్తా. డిప్యూటీ సీఎం పదవి పోయినా పర్వాలేదు…ప్రజలకోసం పోరాటం చేయడానికి ఎప్పుడైనా సిద్ధమన్నారు పవన్‌కల్యాణ్. పోలీస్, ఇంటెలిజెన్స్, జిల్లా కలెక్టర్లకు చెప్పేది ఒక్కటే… లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైనది, హోంశాఖ మంత్రి అనిత గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వైసీపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు రౌడీల్లా వ్యవహరిస్తుంటే మీరేం చేస్తున్నారు? ఆడబిడ్డలను అవమానిస్తుంటే మీరు చర్యలు తీసుకోరా?, మీరు బాధ్యతగా వ్యవహరించండి, చట్టపరంగా చర్యలు తీసుకోండని పవన్ కల్యాణ్ హితవు పలికారు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు, శ్రేణుల్లో కలకలం రేపాయి. మిత్రపక్ష నేత పవనేంటి ఇంతలా మాట్లాడేశారంటూ ఒకింత షాక్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.