ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని జులై 18 వరకు రౌస్ అవెన్యూ కోర్ట్ పొడగించింది. నేటితో కవిత జ్యూడిషల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరు పరిచారు. కాగా ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు.
కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవి ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీహార్ జైలులో ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించి, కోర్టుకు కూడా సమాచారం ఇచ్చింది. దీంతో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే కవిత మరోసారి అరెస్టయినట్టయింది. అటు ఈడీ.. ఇటు సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో కవిత చాలా కాలంగా జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం ఆమె చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆమె దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరణకు గురవుతున్నాయి.