త్వరలో బీజేపీకి కొత్త సారథి..?
బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కసరత్తు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. హరియాణ, జమ్మూకశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అధికారిక ప్రకటన కాస్త వాయిదా పడొచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ ఎన్నికల తర్వాతే నూతన సారథి ఎవరు? ఎప్పుడు పగ్గాలు చేపడతారు అనేది క్లారిటీ వస్తుందట. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో ఎవరొస్తారు అనేదానిపై ఇటు ఆరెస్సెస్, బీజేపీ వర్గాలవారు ఒకింత ఆతృతలో ఉన్నారు.
బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ ఆయనేనా..?
బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యను మోదీ, అమిత్‌షాలు ప్రతిపాదించినప్పటికీ సంఘ్ నాయకత్వం తిరస్కరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సంఘ్‌తో సంబంధాలున్న నేతకే బీజేపీ అధ్యక్షపదవి కట్టబెట్టాలని, ఈసారి ఉత్తరాది నంచి కాకుండా దక్షిణాది వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆరెస్సెస్ పెద్దల డిమాండ్‌గా తెలుస్తోంది. అయితే, మధ్యేమార్గంగా మళ్లీ రాజ్‌నాథ్‌సింగ్ వంటి నేతకు అవకాశం ఇవ్వాలని ప్రధాని, మోదీ సూచించినట్లు తెలుస్తోంది.